source: BCCI X
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించాడు. రెండో రోజు ఆటలో సిక్సర్ బాదిన పంత్.. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించి టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు.
రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే సరాన్ష్ జైన్ వికెట్ కోల్పోవడంతో పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అంతకుముందు తొలి రోజు అతడు మణికట్టు గాయంతో మూడు పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో పంత్ కొట్టిన సిక్సర్ టెస్టుల్లో అతడి ఖాతాలో 101వ సిక్సర్‌గా నమోదైంది. దీంతో 100 సిక్సర్లతో ఉన్న గిల్‌క్రిస్ట్‌ను పంత్ వెనక్కి నెట్టాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు పంత్ ఒంటరిగా మూడో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు
బెన్ స్టోక్స్ – 138
బ్రెండన్ మెకల్లమ్ – 107
రిషబ్ పంత్ – 102
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 100
ధోనినీ అధిగమించిన పంత్
ఇదే ఇన్నింగ్స్‌లో పంత్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. విదేశాల్లో లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ విదేశీ/తటస్థ టెస్టు పరుగుల సంఖ్య 2,501కు చేరింది. దీంతో 2,496 పరుగులతో ఉన్న ధోనిని వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
విదేశీ/తటస్థ టెస్టుల్లో భారత వికెట్ కీపర్ల అత్యధిక పరుగులు
రిషబ్ పంత్- 2,501 (41.68)
ఎంఎస్ ధోని- 2,496 (32.84)
ఫరూఖ్ ఇంజినీర్ - 1,209 (32.67)
సయ్యద్ కిర్మాణి- 1,109 (21.74)
కిరణ్ మోరే- 901 (29.06)
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు లంచ్ సమయానికి పంత్ (88 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జురెల్ (107 బంతుల్లో 59; 5 ఫోర్లు) ఇద్దరూ అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. భారత్ స్కోర్ 419-6గా ఉంది.
తొలి రోజు ఆటలో వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (117) సూపర్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (18) ఒక్కడే తక్కువ స్కోర్‌కు ఔటై నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ నెగ్గి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.


