సెంచరీ వీరుడు జురెల్‌తో పంత్ (PC: BCCI X)
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మంచి ప్రదర్శన కనబరిచాడు. గాయంతో తొలి రోజు ఆట మధ్యలోనే వెనుదిరిగినప్పటికీ.. రెండో రోజు రీఎంట్రీ ఇచ్చి అనూహ్య రీతిలో రాణించాడు.
హాఫ్ సెంచరీ
కొలంబోలో సోమవారం నాటి ఆట సందర్భంగా 89 బంతులు ఎదుర్కొన్న పంత్.. 63 పరుగులు సాధించాడు. అతడి హాఫ్ సెంచరీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
అయితే, భోజన విరామం తర్వాత లంక స్పిన్నర్ కేశారా నువాంత వేసిన తొలి బంతికే.. లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. కానీ పంత్ కాస్త డిఫెన్సివ్‌గా ఆడి ఉంటే అవుటయ్యేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టెక్నిక్ లేకుండా ఆడతాడు..
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పంత్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ దగ్గర పెద్దగా టెక్నిక్ లేదని.. కేవలం భయం లేకుండా దూకుడుగా ఆడటం వల్లే అతడికి గుర్తింపు వస్తోందన్నాడు. అయినా టెక్నిక్‌తో ఎవరికీ పనిలేదని.. అతడి ఖాతాలో జమైన పరుగులు మాత్రమే అందరూ చూస్తారని పేర్కొన్నాడు.
ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘పంత్ ఫియర్‌లెస్ ఆటగాడు. తను ఆడే విధానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. అతడికి టెక్నిక్‌తో సంబంధం లేదు. సాధారణంగా.. చాలా మంది బ్యాటర్లు కొన్ని షాట్లను తప్పకుండా మిస్ చేస్తారు. అలాంటి షాట్లను కూడా పంత్ ఆడతాడు.
ఎందుకంటే అతడు ఎల్లవేళలా అందరికీ భిన్నంగా ఉంటాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో.. తాజాగా కొలంబోలో అతడు అవుటైన తీరును చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఈసారి అతడు కవర్ మీదుగా బంతిని తరలించే ప్రయత్నం చేశాడు.
అదొక్కటే ప్లస్
నిజానికి బంతికి అతడు దూరంగా ఉన్నాడు. కానీ ప్రయత్నం మాత్రం మానలేదు. కాబట్టి టెక్నికల్‌గా పంత్ గొప్ప ఆటగాడేమీ కాదు. అయినా ఎవరికీ ఇక్కడ టెక్నిక్‌తో పనిలేదు. అతడు మ్యాచ్‌లో ప్రభావం చూపుతున్నాడా? లేదా?.. పరుగులు రాబడుతున్నాడా లేదా? అనేదే ముఖ్యం’’ అని భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
పంత్‌లా ఇంకెవరూ ఉండరు
అయితే, టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం మాత్రం పంత్ ఆట తీరును ప్రశంసించాడు. ‘టెస్టుల్లో షాట్లు ఆడే విషయంలో అతడిని ఓ బాధ్యతారహిత ప్లేయర్‌గా చూస్తారు. అయినా సరే అతడు తగ్గడు. యాజమాన్యం కూడా అతడిని దూకుడుగానే ఆడమని ప్రోత్సహిస్తూ ఉందనిపిస్తోంది.
అయితే, కఠిన పరిస్థితుల్లో.. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మాత్రం అతడు పట్టుదలగా నిలబడతాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా అతడికి ఉంది. పంత్ ఒక అరుదైన బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా అతడి దరిదాపుల్లోకి కూడా రాలేడు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో తొలి టెస్టులోనూ పంత్ హాఫ్ సెంచరీ (66) సాధించాడు.
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కొలంబో వేదికగా రెండో టెస్టులో తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా.


