మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఈ హైదరాబాదీ అద్భుతాలు చేస్తున్నాడు. సంచలన స్వింగ్, నిలకడైన వేగంతో ప్రత్యర్ది బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
అయితే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న సిరాజ్.. తన ప్రారంభ రోజుల్లో పడిన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో అండర్-23 జట్టు తరపున ప్రాక్టీస్‌కు హాజరయ్యానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
అండర్-23 జట్టుకు సెలక్ట్ అయినప్పుడు చాలా సంతోషపడ్డా. అయితే టోర్నీకి ముందు నేను డెంగ్యూ జ్వరం బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌కు వెళ్లలేదు. ప్రాక్టీస్‌కు రాకపోతే జట్టు నుంచి తొలగిస్తామని మేనేజ్‌మెంట్ హెచ్చరించింది.
అప్పటికే నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. కంటిన్యూగా సెలైన్‌లు ఎక్కుతునే ఉన్నాయి. సరైన టైమ్‌లో వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేది అని డాక్టర్లు చెప్పారు. కానీ జట్టులో చోటు కోల్పోతానే భయంతో ఉదయం ఐదు గంటలకే మా నాన్నను నిద్రలేపి పరిస్థితి వివరించాను.
వెంటనే మా నాన్న ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఆడగలవా అని ప్రశ్నించారు. పర్వాలేదు నేను మేనెజ్‌చేసుకుంటా అని చెప్పా. దీంతో మా నాన్నే నన్ను స్వయంగా ఆటోలో ప్రాక్టీస్‌కు తీసుకెళ్లారు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, రిపోర్టుల్లో డెంగ్యూ లక్షణాలు ఏవీ లేవని తేలింది" అని సిరాజ్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: 'బాబర్ ఆజం 250 రన్స్ చేయాలి'.. పాక్ జట్టును ఎగతాళి చేసిన బ్రాడ్


