స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Sardar Sarvar Papanna Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

ఏఐ టెక్నాలజీతో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర.. ఎలా ఉందంటే?

Aug 24 2026 8:25 PM | Updated on Aug 24 2026 8:27 PM

Sardar Sarvar Papanna Movie Review In Telugu

చరిత్రలో రాజులు, చక్రవర్తులు, సామ్రాజ్యాధిపతుల పేర్లు తరతరాలకు గుర్తుండిపోతాయి. కానీ ప్రజల కోసం అధికారాన్ని ప్రశ్నించిన తిరుగుబాటు వీరుల కథలు మాత్రం చాలాసార్లు కాలగర్భంలో కలిసిపోతాయి. అలాంటి మరుగునపడిన తెలంగాణ వీరుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అణచివేతను ఎదిరించి, సామాన్య ప్రజల మద్దతుతో తనకంటూ ఒక శక్తిని నిర్మించుకున్న పాపన్న జీవితగాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న – ది రెబ‌ల్ కింగ్ ఆఫ్ డెక్క‌న్. ఈ సినిమాకు వెంకటేశ్ గౌడ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

17వ శతాబ్దపు తెలంగాణ నేపథ్యంలో సాగుతున్న ఈ కథ అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పాపన్న తిరుగుబాటుతో ప్రారంభమవుతుంది. ఒక సామాన్యుడిగా మొదలైన అతని ప్రయాణం క్రమంగా తిరుగుబాటు యోధుడిగా, ప్రజా నాయకుడిగా, చివరకు తనకంటూ ఒక శక్తిని నిర్మించుకున్న నాయకుడిగా ఎదిగే స్థాయికి చేరుతుంది. ప్రజల మద్దతు సంపాదించుకోవడం, సైన్యాన్ని నిర్మించుకోవడం, కోటలను ఏర్పాటు చేయడం, ప్రత్యర్థి శక్తులను ఎదుర్కోవడం వంటి పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. అయితే సినిమా పాపన్న కథను కేవలం కత్తులు, యుద్ధాలు, విజయాలకే పరిమితం చేయలేదు. న్యాయం, ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, స్వయం పాలన వంటి భావాల కోసం పోరాడిన వీరుడి కథే ఈ  స‌ర్దార్ స‌ర్వాయ్ పాప‌న్న.

ఎలా ఉందంటే..

సినిమాలో అత్యంత కీలకమైన అంశం పాపన్న పాత్ర. పాపన్నను కేవలం యుద్ధవీరుడిగా కాకుండా ఒక ఆలోచన, ఒక లక్ష్యం ఉన్న నాయకుడిగా చూపించే ప్రయత్నం కనిపించింది. అన్యాయాన్ని ఎదిరించే సన్నివేశాలు, ప్రజల్లో ధైర్యం నింపే ఘట్టాలు, నిర్ణయాత్మకంగా వ్యవహరించే సందర్భాలు అతని పాత్రకు హీరోయిజాన్ని తీసుకొస్తాయి. పాపన్న చేతిలోని కత్తి ఒక ఆయుధంగా మాత్రమే కాకుండా అన్యాయంపై తిరుగుబాటుకు ప్రతీకగా కనిపించేలా పాత్రను తీర్చిదిద్దారు.

చారిత్రక పాత్రలను కేవలం వీరత్వంతో చూపిస్తే అవి ప్రేక్షకుడికి కొంత దూరంగా అనిపించే అవకాశం ఉంది. ఈ విషయంలో పాపన్న వ్యక్తిగత జీవితం, అనుబంధాలు, భావోద్వేగాలు, ప్రేమకథకు కూడా చోటు కల్పించడం ద్వారా అతని పాత్రకు మానవీయ కోణాన్ని జోడించారు. దీంతో పాపన్న ఒక చరిత్ర పుస్తకంలోని పేరు కాకుండా కలలు, భావోద్వేగాలు, బంధాలు, ఆశయాలు ఉన్న మనిషిగా ప్రేక్షకుడికి దగ్గరవుతాడు. ముఖ్యంగా పాపన్న ఎలివేషన్ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలను అతని వీరత్వాన్ని బలంగా చూపించేలా రూపొందించారు.

ఈ చిత్రానికి మరో ప్రధాన బలం తెలంగాణ నేటివిటీ. గ్రామీణ జీవన విధానం, జానపద సంప్రదాయాలు, భక్తి, అప్పటి సామాజిక పరిస్థితులు, స్థానిక సంస్కృతిని కథా ప్రపంచంలో భాగం చేయడం ద్వారా సినిమా తన మూలాలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. ప్రత్యేకంగా ఎల్లమ్మ పాట తెలంగాణ భక్తి, జానపద సంస్కృతి, వీరత్వాన్ని కథతో అనుసంధానించే ప్రయత్నంగా నిలిచింది. అంటే ఇది కేవలం ఒక చారిత్రక కథగా కాకుండా తెలంగాణ నేల, ప్రజలు, సంస్కృతితో ముడిపడిన కథగా మెప్పించింది. దర్శకుడు, నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి ఎంచుకున్న కథతో పాటు, దాన్ని చెప్పడానికి ఎంచుకున్న సాంకేతిక విధానం కూడా సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. సర్వాయి పాపన్న చరిత్రను కొత్త తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశం ఈ ప్రయత్నంలో స్పష్టంగా కనిపించింది.

చివరగా..

ఇలాంటి చారిత్రక చిత్రాలకు విజువల్ స్కేల్ చాలా కీలకం.  ఏఐ సాయంతో విజువల్స్ అద్భుతంగా తెరకెక్కించారు.  17వ శతాబ్దపు తెలంగాణ వాతావరణం, గ్రామీణ జీవనం, కోటలు, సైనిక బలగాలు, యుద్ధరంగాలు వంటి భారీ ప్రపంచాన్ని సంప్రదాయ భారీ సెట్స్‌పై ఆధారపడకుండా ఏఐ యానిమేషన్‌తో రూపొందించారు. మరుగునపడిన తెలంగాణ వీరుడి గాథను ఏఐ యానిమేష‌న్‌ ద్వారా కొత్త తరానికి పరిచయం చేసిన విభిన్నమైన, సాహసోపేతమైన చారిత్రక చిత్రమే సర్దార్ సర్వాయ్ పాపన్న. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత సర్వాయి పాపన్న ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించడమే ఈ మూవీ ప్రధాన ఉద్దేశం .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement