source: X
టీమిండియా ప్రామిసింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఓ కొత్త అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడు.. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో తొలిసారి రనౌటయ్యాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న రుతు.. నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో కీలకమైన 66 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.
రుతు 47 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మునుపెన్నడూ రనౌట్ కాలేదు. 44.51 సగటున 9 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3294 పరుగులు చేసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.
FIRST TIME IN HIS CAREER 💔
- Ruturaj Gaikwad has been run-out for the first time in his FC cricket. pic.twitter.com/cVYjjwaIbH— Johns. (@CricCrazyJohns) August 25, 2026
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ జోన్ జట్టు విజయానికి ముంగిట్లో ఉంది. ఆ జట్టు మరో 67 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. అయితే చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఉర్విల్ పటేల్ (17) క్రీజ్‌లో ఉన్నాడు. తనుశ్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
287 పరుగుల లక్ష్య ఛేదనలో రుతురాజ్ ధాటిగా ఆడి 70 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి తన జట్టును విజయానికి చేరవ చేశాడు. యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ అత్యంత కీలకమైన 96 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 251 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్ జోన్ 187 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ షమ్స్ ములానీ (4-78), తనుశ్ కోటియన్ (4-46) ధాటికి 222 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 287 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ జోన్ 28 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. ముషీర్ ఖాన్, రుతురాజ్ ఆదుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 220-7గా ఉంది.
ఇదిలా ఉంటే, నిన్ననే ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఈస్ట్ జోన్ జట్టు సెంట్రల్ జోన్‌ను ఢీకొట్టనుంది. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ మ్యాచ్ విజేత ఆగస్ట్ 30ననే మొదలయ్యే రెండో సెమీస్‌లో సౌత్ జోన్‌లో తలపడుతుంది.


