source: BCCI X
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్ట్ క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని మరోసారి స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించిన అనంతరం ఇలా అన్నాడు.
"నేను భారత టెస్ట్ జట్టులో భాగం కావాలని 100 శాతం కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరూ ఈ ఫార్మాట్‌ను ఇష్టపడతారు. ప్రజలు నమ్మకపోవచ్చు కానీ, నాకు నిజంగా రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం"
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు పేరున్న ఇషాన్.. టెస్ట్ క్రికెట్‌లోనూ తనకు తగిన సామర్థ్యం ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు.
2023లో చివరి టెస్ట్
ఇషాన్ కిషన్ 2023 వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు టెస్టులూ ఆడిన అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అదే అతడి చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు
వైట్ బాల్ క్రికెట్‌లో ఇషాన్‌కు మంచి పేరున్నప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతడి గణాంకాలు బలంగానే ఉన్నాయి.
ఇప్పటివరకు 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 106 ఇన్నింగ్స్‌ల్లో 3897 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 39.36గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి.
అంత ఈజీ కాదు
ఇషాన్‌కు వ్యక్తిగతంగా రెడ్ బాల్ క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ.. టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి బలమైన పోటీ ఉంది. రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన ఆప్షన్లు మేనేజ్‌మెంట్ ముందున్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అసాధారణ రీతిలో పరుగులు చేసినా ఇషాన్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే పంత్, జురెల్, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిని కాదని ఇషాన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ.


