source: RCB X
యూపీ టీ20 లీగ్ 2026లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభిస్తున్నాడు. ఈ టోర్నీలో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కాశీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతడి జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపు లక్నో ఫాల్కన్స్‌కు వరుసగా మూడవది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు గానూ భువీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.
ఈ మ్యాచ్‌లో లక్నో ఫాల్కన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భువీ కొత్త బంతితో చెలరేగిపోయాడు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి కాశీ రుద్రాస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువీతో పాటు అభినందన్ సింగ్ (3-16) కూడా సత్తా చాటడంతో రుద్రాస్ 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రుద్రాస్ తరఫున శుభమ్ చౌబే (32 బంతుల్లో 46 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు.
అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. హిమాన్షు సింగ్ (64) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 16 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా, యూపీ టీ20 లీగ్‌లో భువనేశ్వర్ కుమార్ తన అసమాన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అదిరిపోయే స్పెల్స్‌తో సత్తా చాటుతున్న అతడు.. టోర్నీ చరిత్రలోనే (నాలుగు సీజన్లు) 400 డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఈ టోర్నీ 2024 ఎడిషన్‌లో భువీ వేసిన స్పెల్ (4-1-4-0) టీ20ల చరిత్రలోనే అత్యుత్తమమైన స్పెల్స్‌లో ఒకటిగా చలామణి అవుతుంది.
ప్రస్తుతం భువీకి భారత జట్టులో చోటు లేనప్పటికీ.. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్సీబీ వరుసగా రెండు సీజన్లలో టైటిల్ సాధించడంలో భువీది కీలకపాత్ర.


