PC: cricket.com.au X
ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లా ఆటగాడు టస్కిన్ అహ్మద్ ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో హాజిల్‌వుడ్ అందుకోవాల్సిన క్యాచ్ నేలపాలైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల వ్యవహారశైలిపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.
తొలి టెస్టులో ఘన విజయం
కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో డార్విన్ వేదికగా తొలి టెస్టులో బంగ్లా.. ఆసీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత కంగారూల గడ్డపై ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఈ మేరకు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
స్టార్క్ దెబ్బ.. పెవిలియన్‌కు బ్యాటర్ల క్యూ
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. మెకె వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 64 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు టాప్, మిడిలార్డర్‌లో కలిపి ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. మిగిలిన వారు సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు.
హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టిన టస్కిన్
లోయర్ ఆర్డర్‌లో మెహిదీ హసన్ మిరాజ్ (10), తైజుల్ ఇస్లాం (11*), షోరిఫుల్ ఇస్లాం (14) కాసేపు నిలబడటంతో బంగ్లా ఈ మేరకు 60 పరుగుల మార్కు దాటింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో హాజిల్‌వుడ్ బంతితో రంగంలోకి దిగాడు. గంటకు 134 కిలో మీటర్ల వేగంతో మిడిల్ స్టంప్ టార్గెట్‌గా షార్ట్ డెలివరి (మూడో బంతి) సంధించగా.. టస్కిన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. హాజిల్‌వుడ్ ముందుకు వచ్చి దానిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో టస్కిన్ సింగిల్ కోసం వస్తున్నట్లుగా వచ్చి బలంగా హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టాడు. దీంతో క్యాచ్ నేలపాలైంది. ఈ నేపథ్యంలో టస్కిన్ అహ్మద్ కావాలనే తనను ఢీకొట్టాడని హాజిల్‌వుడ్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు.
కావాలనే చేశాడు.. హాజిల్‌వుడ్, కమిన్స్ ఫైర్
ఇంతలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ దగ్గరికి వచ్చి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. టస్కిన్ ఉద్దేశపూర్వకంగానే హాజిల్‌వుడ్ క్యాచ్ అందుకోకుండా చేశాడని.. అతడిని అవుట్‌గా ప్రకటించాలని అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. టస్కిన్ అనుకోకుండా హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టాడని పేర్కొంటూ.. కమిన్స్ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వీళ్లు మారరు
కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఆటగాడు క్యాచ్‌ను అడ్డుకున్నట్లు తేలితే గనుక అతడిని అవుట్‌గా ప్రకటిస్తారు. అయితే, ఇక్కడ టస్కిన్ బంతిని బాదిన వెంటనే పరుగుకు రావడం.. ఇంతలో హాజిల్‌వుడ్ క్యాచ్ కోసం వెళ్లడం రెప్పపాటులో జరిగిపోయిందని.. అందుకే టస్కిన్ సేఫ్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. నెటిజన్లు మాత్రం.. ‘‘వీళ్లు మారరు. టస్కిన్ కావాలనే హాజిల్‌వుడ్‌ను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో ముందుంటారు. గతంలో ధోనితో కూడా ఇలాగే ప్రవర్తించారు. ఆసీస్ జట్టు వీళ్లకు తగిన గుణపాఠం చెబుతుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బంగ్లాపై 101 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కామెరాన్ గ్రీన్ అర్ధ శతకం (51) పూర్తి చేసుకోగా.. అతడితో పాటు నాథన్ లియోన్ (10) క్రీజులో నిలిచాడు.


