టీ20 ప్రపంచకప్-2026 తర్వాత టీమిండియా కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గానే పూర్తిగా ప్లేయర్‌గానే అతడిని జట్టు నుంచి పక్కన పెట్టేశారు. అతడి స్దానంలో అనుహ్యంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టు సారధిగా బీసీసీఐ నియమించింది.
బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు సరికాదు చాలా మంది మాజీలు విమర్శించారు. అయితే భారత జట్టు పగ్గాలను చేపట్టిన ఆరంభంలోనే అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడి సారథ్యంలోని టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఓటమి పాలైంది.
ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్‌గా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతడు కెప్టెన్సీలోనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ తలపడనుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో అయ్యర్ ఆసీస్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని, రిటైర్మెంట్ వరకు అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడని పాంటింగ్ జోస్యం చెప్పాడు.
"శ్రేయస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ 2025 వేలంలో శ్రేయస్ కోసం భారీగా ఖర్చు చేసినప్పుడే, అతడిపై నాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడితో మళ్లీ కలిసి పనిచేయాలని అనుకున్నాను. ఒక ప్లేయర్‌గా అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలననే నమ్మకం నాకుంది.
ఒక కెప్టెన్‌గా, టీమ్ లీడర్‌గా అయ్యర్‌తో పనిచేయడాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. భారత టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. తను టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే వరకు ఆ పదవికి అతడే సరైనోడు" అని ఇండియా టూడే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు?


