బాబర్ ఆజం (PC: X)
పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభం రోజురోజుకీ ముదిరిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాక్.. మూడో టెస్టుకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెప్టెంబరు 9న ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది.
ఏడుగురిపై వేటు
సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, తొలి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్‌లను స్వదేశానికి పంపింది పాక్ బోర్డు. అదే విధంగా టెస్టు జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను తప్పించింది.
ఇక రిలీజ్ చేసిన ఆటగాళ్ల స్థానాల్లో సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా ఫజల్‌తో పాటు పెద్దగా అనుభవం లేని అరాఫత్ మిన్హాస్, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహ్మద్ ఇమ్రాన్ రాంధావా, రజావుల్లాలను ఇంగ్లండ్‌కు పిలిపించింది. ఇక పాక్- ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబరు 9న మూడో టెస్టు మొదలుకానుంది.
బాబర్‌కు అస్వస్థత
ఈ నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. తీవ్రమైన జ్వరం, కఫం, గొంతునొప్పితో అతడు ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు బాబర్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ జట్టుకు బాబర్ అస్వస్థతకు గురికావడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అయితే, బాబర్ కోలుకుంటున్నాడని.. అతడు మూడో టెస్టు ఆడతాడని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా జియో న్యూస్‌కు తెలిపాడు. మరోవైపు బాబర్ సైతం తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
అలా తొలి టెస్టుకు దూరం
కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడి బాబర్ తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.
లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్, 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో మట్టికరిచింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించే దుస్థితి తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా బ్యాటింగ్ నుంచి తప్పించుకునేందుకు ఇమామ్ ఉల్ హక్ గాయం పేరుతో నాటకాలు ఆడాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించగా.. అతడు తన న్యాయవాది ద్వారా ముందుకు వెళ్లనున్నాడనే వార్తలు వస్తున్నాయి.
చదవండి: IND vs AFG: తుదిజట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!


