'నీవొక డమ్మీ కెప్టెన్‌.. వెంటనే రాజీనామా చేయ్‌' | "Babar Azam Is A Dummy Captain...": Rashid Latif Slams Pakistan Cricket Board Amid Mass Changes, Check Details Inside | Sakshi
Sakshi News home page

ENG vs PAK: 'నీవొక డమ్మీ కెప్టెన్‌.. వెంటనే రాజీనామా చేయ్‌'

Sep 2 2026 8:54 AM | Updated on Sep 2 2026 10:19 AM

Dummy Captain Babar Azam Shown No Mercy By Ex-Pakistan Star

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాక్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఘోర ఓటమిని చవిచూసింది. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అదే తీరును పునరావృతం చేసింది. ఆతిథ్య జట్టు చేతిలో 194 పరుగుల తేడాతో ఓడిపోయింది.

దీంతో మూడో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్‌లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లపై కూడా పీసీబీ వేటు వేసింది. ఇవన్నీ సెలక్షన్ కమిటీకి ముందస్తు సమాచారం లేకుండానే జరగడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఆటగాళ్లను, కోచ్‌లను పీసీబీ బలిపశువులను చేసిందని, వారికి మద్దతుగా బాబర్ తన కెప్టెన్సీకి వెంటనే రాజీనామా చేయాల్సిందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

"జట్టులోని సగం మంది ఆటగాళ్లను ఉన్నపళంగా ఇంటికి పంపించడం సరైన నిర్ణయం కాదు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి బాబర్ అజామ్ ఇప్పటికే తన కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. అదే అతడి స్థానంలో నేను ఉండి ఉంటే కచ్చితంగా కెప్టెన్సీని వదిలేసేవాడిని.

అతడొక డమ్మీ కెప్టెన్‌గా మిగిలిపోయాడు. నాయకుడికి, కెప్టెన్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది. నిజమైన నాయకుడు ఎప్పుడూ తన సహచర ఆటగాళ్ల గురించి కూడా ఆలోచిస్తాడు. అసలు ఏడుగురు ఆటగాళ్లను అర్ధాంతరంగా వెనక్కి ఎందుకు పంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇమామ్-వుల్-హక్‌కు గాయమైందని నాకు తెలుసు. కానీ మిగతా ఆరుగురు చేసిన తప్పేమిటి? చివరికి కోచ్, నీ మెంటార్‌లను సైతం వెనక్కి పంపేశారు.

సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఉమర్ గుల్ ఎన్నో ఏళ్ల పాటు పాక్ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. అలాంటి దిగ్గజాలకు అవమానం జరుగుతుంటే బాబర్ నోరుమెదపకుండా మౌనంగా ఉండడం ఏమాత్రం తగదు. పీసీబీకి ఎప్పుడూ ఒక డమ్మీ కెప్టెన్ మాత్రమే కావాలి. ఈ ఘ‌ట‌న‌తో అది మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని" ల‌తీఫ్ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs AFG: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ అన్నారు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement