source: X
షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో టీమిండియా ఆటగాడు, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్, జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అమృత్‌సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఫలితంగా అతడి జట్టు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
భారీ లక్ష్య ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని కసి తీరా బాదాడు. అతడి ఊచకోత ధాటికి అమృత్‌సర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ప్రభ్‌సిమ్రన్‌కు అన్మోల్ మల్హోత్రా (23 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హర్జస్ సింగ్ టాండన్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విశ్వనాథ్ సింగ్ (12 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించారు.
అంతకుముందు అమృత్‌సర్ తరఫున నమన్ ధిర్ కూడా సుడిగాలి శతకం బాదాడు. ధిర్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 82; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా జతకలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అమృత్‌సర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కాగా, దీనికి ముందు మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ, నమన్ ధిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ వారి జట్టు ఓటమిపాలైంది.
చదవండి: అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. కేవలం 26 బంతుల్లోనే


