అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు | Trump Predicts US-Iran War Will End After November Midterm Elections, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Sep 10 2026 6:42 AM | Updated on Sep 10 2026 8:59 AM

Trump Predicts Iran War Will End Immediately After

అమెరికా–ఇరాన్‌ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల తర్వాత వెంటనే యుద్ధం ముగుస్తుంది.. ఇరాన్‌ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు’’ అని ట్రంప్‌ అన్నారు.

బుధవారం రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో ఇరాన్‌ లేదని పేర్కొన్నారు. నవంబర్‌ ఎన్నికల వరకు ఇరాన్‌ యుద్ధాన్ని కొనసాగించలేదన్న ధీమాను వ్యక్తం చేశారు.

చర్చలకు అవకాశం ఉన్నా..
ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశాన్ని ట్రంప్‌ పూర్తిగా కొట్టిపారేయలేదు. ‘‘చర్చలు జరగొచ్చు.. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు’’ అని స్పష్టం చేశారు. అంటే, యుద్ధం ముగింపు విషయంలో చర్చల కంటే అమెరికా ఒత్తిడికే ట్రంప్‌ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

ఇప్పటికే అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. తక్షణమే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదనే సమయంలో ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తత
మరోవైపు హర్ముజ్‌ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఐదు ఇరాన్‌ చమురు ట్యాంకర్లను ముంచినట్లు సమాచారం వెలువడిన నేపథ్యంలో.. ఇరాన్‌ 10 నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.

తగ్గిన ఆదరణ
ఇరాన్‌ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో ట్రంప్‌ పట్ల ఉన్న ప్రజాదరణ విపరీతంగా పడిపోయింది. యుద్ధంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే యుద్ధం ముగుస్తుందని ట్రంప్‌ చెప్పడం అమెరికా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌తో తక్షణ చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పుగా విశ్లేషకులు పరిగణించనున్నారు . 

ఇటు ఉక్రెయిన్‌ సంక్షోభంపైనా.. 
ఉక్రెయిన్‌ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ట్రంప్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అంగీకరిస్తే డీల్‌ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తిస్థాయి దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టినా కాల్పులకు మాత్రం తెరపడలేదు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య బెలారస్‌లో చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్‌ నాటికి ఆ చర్చలు నిలిచిపోయాయి. 

2025లో మరోసారి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగాయి. రష్యా–ఉక్రెయిన్‌ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశమైనా కాల్పుల విరమణ, భూభాగాల అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ మాస్కో, కీవ్‌లలో పర్యటించి కొత్తగా చర్చలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అయితే భూభాగాలపై రష్యా, ఉక్రెయిన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: ఇరాన్‌పై సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement