ఐరాస భద్రతా మండలికి నివేదించిన ఐఏఈఏ బోర్డు
20 ఏళ్లలో ఇదే తొలిసారి
వియన్నా: ఇరాన్‌లోని వివిధ అప్రకటిత ప్రదేశాలలో తనిఖీ అధికారులు గుర్తించిన యురేనియం ఆనవాళ్లపై దీర్ఘకాలంగా సాగుతున్న దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) బోర్డు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించింది. ఇరాన్‌పై మండలికి నివేదించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. వియన్నాలోని ఐఏఈఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరాన్ అంశంపై ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
35 మంది సభ్యులు కలిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో 23 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, రష్యా, నైజర్ దీనిని వ్యతిరేకించగా 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఒక దేశం ఓటు వేయలేదు. ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ప్రవేశపెట్టాయి. యురేనియం ఆనవాళ్లకు సంబంధించిన విచారణకు ఇరాన్ సహకరించకపోవడం ద్వారా అణువ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఐఏఈఏ బోర్డు నిర్ధారించింది.
2003 వరకు ఇరాన్ రహస్య అణు ఆయుధ కార్యక్రమాన్ని కలిగి ఉందనడానికి, అక్కడ లభించిన యురేనియం ఆనవాళ్లే సాక్ష్యమని పశి్చమ దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతోంది. శాంతియుత అవసరాల కోసమే యురేనియం నిల్వ చేస్తున్నట్లు వాదిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్‌కు సంబంధించిన యురేనియం అంశాన్ని ఐఏఈఏ బోర్డు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించడం గమనార్హం.


