ముంచుకొస్తున్న భూతాపోన్నతి ప్రభావం
లక్ష్యాలకు మించి పెరగనున్న ఉష్ణోగ్రతలు
సౌర వికిరణ మార్గమే శరణ్యం
దేశాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
భూమికి ముప్పు తప్పేట్టు లేదు... భూతాపోన్నతికి పగ్గాలేసే లక్ష్యం గురి తప్పుతోంది! సగటు ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగడం ఖాయమవుతోంది.
మరి... తరుణోపాయం????
భూతాపోన్నతి ప్రభావాలను తట్టుకునేందుకు ప్రపంచం సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశాల్లేవు. ఫలితంగా ఈ శతాబ్దం అంతానికి భూమిపై అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన వేడి కారణంగా మనిషి బతికే పరిస్థితులు ఉండవన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవడం తథ్యమన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో రెండు నెలల్లో టర్కీలో వాతావరణ మార్పులపై ఐరాస సదస్సు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
భూతాపోన్నతిని తగ్గించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే మేలైన మార్గం అని అనుకునేవారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా మనం మారడం, భూతాపోన్నతికి అనుగుణంగా సర్దుకుపోవడాన్ని ఓడిపోవడంగా భావించేవారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచదేశాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ (వాతావరణానికి తగ్గట్టుగా మనం మారడం) అత్యవసరమైన విధానంగా మారిపోయింది. ఫలితంగా ఒకప్పుడు వివాదాస్పదమైన సౌర వికిరణ మార్పు పద్ధతికి ప్రాచుర్యం పెరుగుతోంది.
సౌర వికిరణ మార్పు అంటే?
సౌర వికిరణ మార్పు లేదా సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ (ఎస్‌ఆర్‌ఎం) అంటే సూర్యకాంతిలో కొంత భాగాన్ని మళ్లీ అంతరిక్షంలోకి పంపించడం అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే సూర్యుడికి అద్దం పట్టడం. అయితే ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఏర్పాట్లు అవసరం. భూమిపై పడుతున్న సూర్యరశి్మలో కనీసం ఒక శాతాన్ని ఇలా వెనక్కు పంపించగలిగితే కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణంలోకి చేరిన విషవాయువుల ప్రభావాన్ని తగ్గించవచ్చునని సగటు ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. నేలపై లేదంటే అంతరిక్షంలో భారీసైజున్న అద్దాలు ఏర్పాటు చేసి సూర్యుడి నుంచి పడే కాంతి మళ్లీ అంతరిక్షంలోకి చేరేలా చేయాలని ఆలోచించారు. అలాగే అప్పుడప్పుడూ రసాయన కణాలు చల్లడం ద్వారా మేఘాలు మరింత సౌర రేడియోధార్మికతను వెనక్కు పంపించగలమని అంచనాలున్నాయి. అగి్నపర్వతాలు బద్ధలైనప్పుడు వెలువడే పొగ ఆకాశాన్ని కమ్మేసి చాలాకాలంపాటు సూర్యరశ్మి కిందపడకుండా చేస్తున్నట్లు అన్నమాట.
ఇదీ వివాదం...
ఎస్‌ఆర్‌ఎం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది కానీ.. కర్బన ఉద్గారాలను తగ్గించదు. పైగా పర్యావరణ వ్యవస్థలపై దీని ప్రభావం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఎలాగూ ఇది ఉందన్న సాకుతో పరిశ్రమలు, ప్రభుత్వాలు వాతావరణంలోకి చేరుతున్న విష వాయువులను తగ్గించడంపై దృష్టి పెట్టవన్నది మరో ఆందోళన. ఎస్‌ఆర్‌ఎం పద్ధతిని ఒకసారి వాడి... ఉష్ణోగ్రతలు తగ్గాయి కాబట్టి నిలిపేద్దామనుకుంటే అది కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ‘టెర్మినేషన్ షాక్’వల్ల భూమి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. 2023 నుంచి సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కొత్త ఇంధన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం ఈ టెర్మినేషన్ షాక్‌ను ధ్రువీకరిస్తున్నాయి.
మరోవైపు ఎస్‌ఆర్‌ఎం పద్ధతిపై ఇప్పటివరకూ స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు, నియంత్రణ వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలో దీన్ని కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఎమర్జెన్సీ ఏర్పాటుగా మాత్రమే చూడాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. 2024లో స్విట్జర్లాండ్ ఎస్‌ఆర్‌ఎంపై ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించగా పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జపాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు మద్దతివ్వగా, పసిఫిక్, ఆఫ్రికా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌సహా కొందరు రిపబ్లికన్లు వాతావరణ మార్పులనే కొట్టిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీలో జరగబోయే వాతావరణ మార్పుల సదస్సు ఎస్‌ఆర్‌ఎంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది.
–సాక్షి, నేషనల్ డెస్క్


