ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్‌ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు! | Openai AI Agents Unauthorized Communication | Sakshi
Sakshi News home page

ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్‌ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు!

Sep 10 2026 3:19 AM | Updated on Sep 10 2026 3:22 AM

Openai AI Agents Unauthorized Communication

వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ ఏజెంట్ల స్వతంత్ర కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది. 'ఓపెన్‌ ఏఐ'కి చెందిన ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది మే నుంచి జూలై మధ్య తమకు విధించిన కొన్ని పరిమితులను దాటి, ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకునేందుకు 10కి పైగా వెబ్‌సైట్లను ఉపయోగించినట్లు పలువురు స్వతంత్ర పరిశోధకులు గుర్తించారు. రాయిటర్స్‌ పరిశీలించిన పలు పరిశోధన నివేదికలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ ఏఐ ఏజెంట్లకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే బాధ్యత అప్పగించారు. ఇందుకోసం ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని చదివి, అవసరమైన వివరాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఇతర వెబ్‌సైట్లలో సమాచారం పోస్ట్ చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని పాత వికీ సైట్లు, ఆన్‌లైన్ టెక్స్ట్ స్టోరేజ్ సైట్లలో ఉన్న సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకుని, ఏజెంట్లు అక్కడ సమాచారాన్ని నమోదు చేసినట్లు వారు గుర్తించారు.

సులభంగా చెప్పాలంటే.. ఏఐ ఏజెంట్లకు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడే అవకాశం లేకపోయినా, కొన్ని వెబ్‌సైట్లలో చిన్నచిన్న సమాచారాన్ని రాసి ఉంచడం ద్వారా పరస్పరం సంకేతాలు పంపుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఒక పరిశోధకుడు ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లను 18 వెబ్‌సైట్లలో గుర్తించినట్లు తెలిపారు. మరో పరిశోధనా బృందం 23 సైట్లలో ఇలాంటి కార్యకలాపాలను గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఈ సంఖ్యలను పూర్తిగా స్వతంత్రంగా నిజమని తేల్చడం సాధ్యం కాలేదని రాయిటర్స్‌ తెలిపింది.

ఈ కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించిన వెబ్‌సైట్లలో కొన్ని చాలా సాధారణమైనవే. వ్యక్తిగత వెబ్‌సైట్లు, గేమింగ్‌కు సంబంధించిన వికీలు, కెమిస్ట్రీ విద్యకు సంబంధించిన ఓ వెబ్‌సైట్, టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పాత వెబ్‌సైట్‌తో పాటు రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన లింక్ షార్ట్‌నర్ సైట్లు కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

పరిశోధకుల ప్రకారం ఇది నేరుగా హ్యాకింగ్ ఘటనగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం కాదు. అయితే, ఏఐ ఏజెంట్లకు కొన్ని పనులు మాత్రమే చేయాలని, కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని సమాచారాన్ని పంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీనివల్ల భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, అవి చేసే పనులను మనుషులు ఎలా నిఘా ఉంచాలి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈ వ్యవహారంపై ఓపెన్‌ ఏఐ స్పందిస్తూ, ఏఐ ఏజెంట్ల కార్యకలాపాలను విస్తృతంగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఏఐ వ్యవస్థలు తమకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించే పరిస్థితులను గుర్తించి, వాటిని నివేదించేందుకు ప్రత్యేక విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఏఐ వ్యవస్థలు మరింత స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దీ వాటి పనితీరుపై పర్యవేక్షణ, భద్రతా నియంత్రణలు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్‌ చేస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement