వాషింగ్టన్ డీసీ: సెప్టెంబర్ 11 ఈరోజు గుర్తుకొస్తే చాలు అమెరికన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. రెండు విమానాలను హైజాక్ చేసి ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టడంతో వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అందుకే ఆ దేశ చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడిగా సెప్టెంబర్ 11ను అభివర్ణిస్తారు. అయితే ఆ దాడికి సరిగ్గా రెండురోజుల ముందు ఆల్‌ఖైదా సభ్యులు చేసిన పనిపై అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న అహ్మద్ షా మసూద్‌ను ఆల్‌ఖైదా సభ్యులు 2001 సెప్టెంబర్ 9న హత్య చేశారు. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ హత్య చోటుచేసుకుంది. తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తున్న సమయంలో, వారికి అనుకూలంగా ఒసామా బిన్ లాడెన్ ఈ హత్యను చేయించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
న్యూస్ వీక్ కథనం ప్రకారం.. "అఫ్గానిస్థాన్‌లోని నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహించిన మసూద్.. పంజ్‌షీర్ లోయలోని తన శిబిరంలో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు. వారిద్దరూ బెల్జియం టెలివిజన్‌కు చెందిన జర్నలిస్టులుగా పరిచయం చేసుకున్నారు. భద్రతా తనిఖీలను దాటి వారు మసూద్‌ను కలిశారు. అయితే, వారు తీసుకొచ్చిన వీడియో కెమెరాలో పేలుడు పదార్థాలను దాచి అనంతరం మసూద్‌ను కలిసిన సమయంలో ఆత్మాహుతి దాడి చేసి అతనిని అంతమెుందించారు. అయితే మసూద్ మరణాన్ని నార్తర్న్ అలయన్స్ అధికారికంగా సెప్టెంబర్ 15 వరకు బహిరంగంగా ధ్రువీకరించలేదు" అని కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ హత్య ఎందుకు చేశారు?
తాలిబన్లకు వ్యతిరేక పోరాటంలో మసూద్ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో ఆయన ఒక తిరుగుబాటు నెట్‌వర్క్‌ను నిర్మించారు. తాలిబన్లు దేశంపై నియంత్రణ సాధించే క్రమంలో ఆయన వారికి ప్రధాన సవాలుగా నిలిచారు. అంతేకాకుండా, ఆయన నాయకత్వం, ప్రజాదరణ తాలిబన్లను వ్యతిరేకించే వర్గాలకు ఆయనను అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మార్చాయని. న్యూస్ వీక్ రాసుకొచ్చింది.
అయితే ఈ నేపథ్యంలోనే బిన్ లాడెన్‌కు మసూద్ నుంచి ముప్పు ఉందని లాడెన్ భావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాలిబన్లు, అల్‌ఖైదాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మసూద్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో.. ఆయనను లేకుండా చేయడం బిన్ లాడెన్, అతని మిత్రులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అమెరికా తనపై జరపబోయే దాడులను ముందుగానే ఊహించిన నేపథ్యంలోనే మసూద్‌ను అంతమెుందించారని కథనాలు పేర్కొన్నాయి.
బిన్ లాడెన్ హత్య
సెప్టెంబర్ 11 దాడుల అనంతరం, అమెరికా తన కొత్త ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్థాన్ సహకారం కోసం ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో మహ్మూద్ అహ్మద్ అమెరికా అధికారులను కలిశారు. అమెరికా దళాలు కూడా కొద్దికాలానికే పాకిస్థాన్ భూభాగంలో రహస్యంగా మోహరించాయి. 2011, మే 2న అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్ నగరంలో ఉన్న అతని రహస్య స్థావరంపై ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పేరుతో మెరుపు దాడి చేసి అతనిని హతమార్చాయి. ఈ హత్య వివరాలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ప్రకటించారు.


