అత్యంత ఆశాజనకమైన పరిస్థితుల్లోనూ 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చు
తాజా ‘లిమిటింగ్ ఓవర్ షూట్’ నివేదికలో ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
వాతావరణ మార్పుల కారణంగా భూతాపం మునుపటి అంచనాల కంటే వేగంగా పెరిగే ముప్పు ఎక్కువగా ఉందా? త్వరలోనే నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటి 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరిపోయే పెను ప్రమాదంలో భూగోళం కొట్టుమిట్టాడుతోందా? ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (యూఎన్‌ఈపీ) నిస్సందేహంగా అవునంటోంది.
అలాగని మరీ ఎక్కువ కాలం తర్వాతేమో అనుకునేరు, కాదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఈ పరిమితి దాటిపోయే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన ‘లిమిటింగ్ ఓవర్ షూట్’ (Limiting Overshoot) నివేదికలో యూఎన్‌ఈపీ ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అత్యంత ఆశాజనకమైన పరిస్థితుల్లో కూడా పారిశ్రామిక పూర్వపు స్థాయితో పోలిస్తే ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని, ఇతర పరిస్థితుల్లో ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని తెలిపింది.
మహాసముద్రాలపై తీవ్ర ప్రభావం
వాతావరణంలోకి అతిగా విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోవటం వల్ల సముద్రాలు తీవ్ర ఆమ్లీకరణకు గురవుతున్నాయి. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి కారణంగా సముద్ర జీవుల ఆవాస పరిధి ఏకంగా 200 మీటర్ల మేర కుచించుకుపోతోంది. దీనివల్ల పగడపు దిబ్బలు, ఆయిస్టర్లు, క్లామ్స్, కొన్ని రకాల ప్లవకాలు తమ గూళ్లు, రక్షణ కవచాలను నిర్మించుకోలేక అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. భారత్‌తో పాటు చిన్న ద్వీప దేశాలు, లోతట్టు తీరప్రాంత నగరాలు సముద్ర మట్టాలు పెరగడం వల్ల ముంపు బారిన పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఆర్కిటిక్ మహాసముద్రం పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇతర సముద్రాల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు వేగంగా ఆమ్లీకరణ చెందుతోంది.
బలమైన సంకల్పం అవసరం
పర్యావరణ బడ్జెట్ లోటును పరిమితం చేసేందుకు ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఈ నివేదిక సూచించింది. భారీ మంచు పలకలు కరిగిపోవటం, అమెజాన్ అడవులు క్షీణించటం, వాతావరణాన్ని నియంత్రించే ‘అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్’దెబ్బతినటం వంటి కోలుకోలేని నష్టాలు వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నివేదిక కీలక సూచనలు చేసింది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్గారాలను మీథేన్ సహా హరితగృహ వాయువుల ఉద్గారాలను తక్షణమే తగ్గించి నెట్‌జీరో స్థాయికి చేర్చాలని పాలకులకు పిలుపునిచ్చింది. బలమైన రాజకీయ సంకల్పం, అంతర్జాతీయ సహకారం, న్యాయమైన ఆర్థిక వనరులు సమకూరిస్తేనే ఈ పర్యావరణ ముప్పు నుంచి భూగోళాన్ని రక్షించుకోగలమని యూఎన్‌ఈపీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నీటి కొరతతో సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా?
ముంచుకొస్తున్న విపత్తులేమిటి?
ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల మార్కును దాటిన తర్వాత ఉష్ణోగ్రతలో పెరిగే ఏ కొంచెం మార్పయినా పెను ముప్పులను తెచ్చిపెడుతుందని యూఎన్‌ఈపీ నివేదిక తీవ్రంగా హెచ్చరించింది. దీనివల్ల ఏమవుతుంది?
తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తుపాన్లు, కరువులు పెరుగుతాయి.
పర్యావరణ వ్యవస్థల విధ్వంసం తీవ్రమవుతుంది.
చిన్న ద్వీప దేశాలు, లోతట్టు తీరప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే ముప్పు పెరుగుతుంది.
మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి సరఫరా, మౌలిక వసతులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
– సాక్షి, స్పెషల్ డెస్క్


