మద్యం సేవించడం పట్ల ‘ప్రతిరోజూ అత్యంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు’ అనే అపోహ ఉండేది. కానీ అది మౌత్, బుక్కల్ మ్యూకోసా (బుగ్గ లోపల) క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది. మద్యం సేవనం లాలాజల ప్రవాహాన్ని తగ్గిస్తుంది, మైక్రోబయోమ్ అసమతుల్యతకు దారితీస్తుందని హార్వర్డ్ హెల్త్ ప్రచురించింది.
» మద్యం సేవించడంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వంటి ప్రముఖ సంస్థలు స్పష్టం చేశాయి. ఉదాహరణకు రోజుకు ఒక గ్లాసు వైన్, బీర్ లేదా ఒక షాట్ స్పిరిట్స్ తీసుకునే అలవాటు వల్ల ‘నోరు, గొంతు, అన్నవాహిక, రొమ్ము, పేగు, కాలేయం క్యాన్సర్‌లను దరికి చేరుస్తుందని ఆ సంస్థలు హెచ్చరించాయి.
» తక్కువ మోతాదు కూడా ఇంత హాని కలిగిస్తుందా అనే సందేహానికి వారి వివరణ ఒక్కటే. మద్యం (ఇథనాల్) ఎంత పరిమాణంలో ఉన్నా అది కణాలకు నష్టం కలిగిస్తుంది. ప్రాథమికంగా అది జీవసంబంధమైన యంత్రాంగం మీద ప్రభావం చూపిస్తుంది.
» శరీరం ఆల్కహాల్‌ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దానిని అసిటాల్డిహైడ్ అనే విషపూరిత రసాయనంగా మారుతుంది. ఇది క్యాన్సర్ కారకం. కణాల మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటుంది. డీఎన్‌ఏ దెబ్బతింటుంది.
» మద్యం ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్‌ల స్థాయులను పెంచుతుంది. అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రోజుకు ఒక్క పెగ్ తీసుకున్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 14 శాతం పెరిగినట్లే.
» నోరు, గొంతు నుంచి కడుపులోకి చేరే క్రమంలో ఆల్కహాల్ ఒక ద్రావకంలా పనిచేస్తుంది. పర్యావరణ విషపదార్థాలు కణాల్లోకి సులభంగా చొచ్చుకుని పోయి ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. కణజాలం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి.
» మద్యాన్ని అధిక మోతాదులో సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు అత్యధికంగా ఉంటాయి. తక్కువ మోతాదు కలిగించే ముప్పు కూడా చిన్నదేమీ కాదు, కాబట్టి క్యాన్సర్ నివారణకు మద్యం సేవించకపోవడమే ఉత్తమమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
– సాక్షి, స్పెషల్ డెస్క్


