మహేంద్రగిరిలోని ఐపీఆర్‌సీలో క్రయోజనిక్ ఇంజిన్‌కు ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్న దృశ్యం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి రాకెట్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన ఎల్‌వీఎం3 ఏడవ కార్యాచరణ మిషన్ కోసం క్రయోజనిక్ ఇంజిన్ ఫ్లైట్ హాట్ టెస్ట్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాత్మక పరీక్షను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ)లోని మెయిన్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ (ఎంఈటీ)లో నిర్వహించారు. ప్రయోగించబోయే ప్రతి ఎల్‌వీఎం3 రాకెట్‌కు సంబం«ధించి క్రయోజనిక్ ఇంజిన్లు ఆమోదం పొందడంలో భాగంగా హాట్‌టెస్ట్ ప్రక్రియను చేయడం పరిపాటి.
అధిక ఎత్తులో పనిచేయడానికి రూపొందించిన నాజిల్‌తో ఈ అప్పర్ స్టేజ్ ఇంజిన్ హాట్ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఒక నాజిల్ ప్రొటెక్షన్ సిస్టంను అభివృద్ధి చేసి పలు క్వాలిఫికేషన్ల ద్వారా ధ్రువీకరించుకుంటారు. హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటిలో ప్రయోగానికి సమానమైన వాక్యూమ్ పరిస్థితులను అనుకరించడం ద్వారా క్రయోజనిక్ ఇంజిన్ల పరీక్షకు పట్టే సమయాన్ని, శ్రమను తగ్గిస్తుంది.
ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా పేలోడ్స్ సామర్థ్యాన్ని పెంచడానికి భవిష్యత్తులో ప్రయోగించబోయే ఎల్‌వీఎం3 రాకెట్లలో క్రయోజనిక్–20 (సీఈ–20) క్రయోజనిక్–32 (సీఈ–32) దశలను 22 టన్నుల థ్రస్ట్ స్థాయిలో పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఈ–20 ఇంజిన్ పనితీరు పరీక్షలోని అన్ని లక్ష్యాలను చేరుకుందని, ఇంజిన్ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరీక్షలో గగన్‌యాన్ కోసం సీఈ–32 దశలకు ఉద్దేశించిన ఎల్‌ఓఎక్స్ ట్యాంక్ ప్రెషరైజేషన్ మాడ్యూల్ కూడా విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు.
ఆదోని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 7.45 గంటల కొన్ని సెకన్ల పాటు భూమి అదురుతున్నట్లు అనిపించడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులుదీశారు. అలాగే, ఆలూరు మండలంలోని గ్రామాల్లోనూ భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. తహసీల్దార్ వేణుగోపాల్, డీఎస్పీ వెంకటరమణ తదితరులు కూడా భూమి కంపించినట్టు ధ్రువీకరించారు.


