చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న దృశ్యం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం జిల్లా పెదపాడు పరిధిలోని అంబేడ్కర్ గురుకులంలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు వేసుకున్న ఓ పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. బుధవారం రాత్రి స్టడీ అవర్ అయ్యాక ముగ్గురు తమ రూమ్‌కు వెళ్లే క్రమంలో ఫ్లోర్ క్లీన్ చేసే లైజాల్ డబ్బాను చూసి ఇది తాగితే ఏమీ కాదంటూనే, ఎవరు ఎక్కువ తాగగలరో అంటూ పందెం వేసుకున్నారు. అందులో ఇద్దరు విద్యార్థినులు కొద్దిగా తాగగా మరో విద్యార్థిని ఎక్కువ తాగేసింది.
అరగంట తర్వాత ఆమెకు వాంతులు మొదలయ్యాయి. దీంతో స్కూల్ యాజమాన్యానికి బుధవారం రాత్రి 11 గంటలు సమయంలో సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ పద్మావతిని వివరణ కోరగా.. ఫ్లోర్ క్లీన్ చేసే లైజాల్ గ్లాస్‌లో ఉండిపోవడంతో మంచినీరు అనుకుని ఆ విద్యార్థిని తాగేసిందని, ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. దళిత సంఘ నాయకులు విద్యార్థినని పరామర్శించారు.


