బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు | Heavy Rain Likely in Parts of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు

Sep 11 2026 5:10 AM | Updated on Sep 11 2026 5:10 AM

Heavy Rain Likely in Parts of Andhra Pradesh

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు 

వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు 

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలుల సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని సూచించారు. 

నేడు పలు జిల్లాల్లో వర్షాలు 
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

అనకాపల్లిలో భారీ వర్షం 
అల్పపీడనం ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల గురువారం భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 3.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా నంగినారపాడు, వూడేరు, పరవాడలో 3.4, గంధవరంలో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement