బ్యూరోక్రటిక్ పాలన అవసరంలేదు
చెప్పింది చేశానని మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాలి
సమస్యలపై సీఎంఓకు, సీఎస్‌కు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు
పనితీరు చూపకపోతే ఆ పదవికి పనికిరారు: సీఎం
సాక్షి, అమరావతి: తనకు రాజకీయ పాలన కావాలి తప్ప, బ్యూరోక్రటిక్ పాలన అవసరంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి స్పష్టంచేశారు. గత ఎన్నికల ముందు చెప్పింది చేశానని.. మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాల్సి ఉందని, సమస్యలు నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినా లేదా తప్పుడు ప్రచారం చేసినా సరైన సమయంలో స్పందించకపోతే ప్రభుత్వం పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రెండ్రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు గుర్తు పెట్టుకునేలాగ కలెక్టర్ల పాలన ఉండాలన్నారు.
ప్రభుత్వం పాలసీ ఇస్తుందని, దాన్ని మంత్రులు, అధికారులు అమలుచేస్తారని, వాటిపై తప్పుడు ప్రచారాన్ని మంత్రులు, అధికారులు ఖండించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాలా అంటూ సీఎం అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో క్రీడా కోటా కింద మూడు శాతం రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చామని, దాన్ని అధికారులు అమలుచేశారని.. అయితే, దానిపై తప్పుడు ప్రచారం చేస్తే ఆ ప్రచారం తప్పు అని చెప్పకపోతే శిక్ష మనకు పడుతుందన్నారు. పాలనలో మరింత వేగం పెంచాలన్నారు.
సమస్యలపై వెంటనే స్పందిస్తూ నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. సీఎంఓకు, సీఎస్‌కు సమస్యలను చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను తీసుకురావాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
గ్రోత్ ఇంజన్లను గుర్తించి సంపద పెంచాలి
ప్రతి నియోజకవర్గానికి 10–15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలి. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. 2027 నాటికి భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసే బాధ్యత మనందరిది. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్లాలి.
కుటుంబ యూనిట్‌గా ఆధార్ అనుసంధానం చేయాలి. దీంతో అర్హులెవరో అనర్హులెవరో తేలుతుంది. పెన్షన్ కోసం, ఇంటి కోసం కుటుంబాలను విడతీస్తున్నాం. ఇక నుంచి పెద్ద కుటుంబాలకే ప్రోత్సాహం. ఏడుగురుంటే మూడు, నాలుగు బెడ్ రూమ్‌ల ఇళ్లు కట్టిస్తాం. ఏడాదిలోగా అర్హులకు ఇళ్ల స్థలాల ఇవ్వాలి. సెల్ టవర్లకు అవసరమైన భూములను కలెక్టర్లు సకాలంలో ఇవ్వడంలేదు. పనితీరు చూపకపోతే ఆ పదవికి పనికిరారు. జెన్‌జీ ఆలోచనలకు అనుగుణంగా నాయకత్వం ఉండాలి.
54% లోటు వర్షపాతం
ఈ ఏడాది రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరువు నేపథ్యంలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తరువాత పశుగ్రాసం, జీవనోపాధికి పెద్దపీట వేయాలి. వర్షాభావంవల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు. ఉల్లి ధరలతో ప్రభుత్వాలే కూలిపోయాయి. వర్షాల్లేవని భూములను బీడుగా వదిలేయవద్దు. ప్రకృతి వ్యవసాయం విధానంలో తక్కువ నీటితో పండే పంటలను, బహుళ పంటల విధానాన్ని అమలుచేయాలి.
ఇక పంటల బీమా ఏ పంటకు చేస్తే ఆ పంటకే వర్తిస్తుందని, వేరే పంట వేస్తే వర్తించదని, అసలు పంట వేయకపోతే కూడా బీమా వర్తించదని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే వారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో పర్యటించాలని చంద్రబాబు చెప్పారు.


