చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
బాబు స్కామ్‌ల చరిత్రలో ఇదో ఆణిముత్యం
ఆధారాలు బయట పెడుతుంటే చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది
ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. రెండూ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?
ఇది స్కామ్‌కు ద్వారాలు తెరవడం కాదా?
అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?
టీచర్ పోస్టుల బేరసారాల కాల్ బయటపడితే కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు?
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ముసుగులో అసలు పరీక్షలే లేకుండా 372 మందికి టీచర్ ఉద్యోగాలిచ్చి రిక్రూట్‌మెంట్ పూర్తయ్యాక గేట్లు మూసేశారు
ఏపీ, తెలంగాణ అసోసియేషన్లు స్పష్టంగా వాస్తవాలు తేల్చాయి
ఫ్యామిలీ ప్యాకేజీలు మాట్లాడుకుని పోస్టులు అమ్మేసుకున్నారు
క్రీడాకారులు కాని వారే కాదు.. టెట్ పాసవ్వని వారికీ ఉద్యోగాలిచ్చేశారు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది
అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకోక తప్పలేదు
ఏడుసార్లు పరిశీలిస్తే ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి?
ఎవరు చెబితే ఇన్ని తప్పులు చేశారు?
ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా అటవీ ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు
మెగా డీఎస్సీ స్కామ్ బయట పడడంతో వాటికి బ్రేక్ పడింది
వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయ్
మెగా డీఎస్సీపై సీబీఐతో విచారణ జరపాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.
– మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్‌గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారు
డీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.
1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ..
ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు?
ఇది స్కామ్‌కు ద్వారాలు తెరిచినట్లు కాదా?
అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.
2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్‌కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్‌ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?
3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా?
ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?
4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్‌ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్‌గా ఆడియో కాల్‌లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్)లో చూస్తే రిమాండ్‌కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.
అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...!
ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగా
ల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.
జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్‌షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్‌బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.
పైనుంచి ఫోన్.. అంతా సెట్
బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్‌షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్‌కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు!
టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..
మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్‌లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్‌జీటీ పోస్టుకు టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? 
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు
‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి.
‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!
ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా.
ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?
పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్‌లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్‌లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.
అందుకే సీబీఐ విచారణ అవసరం
అసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్‌లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్‌లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.
తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!
తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్‌అధికారుల ప్రెస్‌మీట్
తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...
⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.
⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.
⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.
⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.
⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.
⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్‌లో పోటీలు జరగకపోయినా
దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.
⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.
చక్రం తిప్పిన శాప్..
మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు.


