జైలు నుంచి వచ్చాక.. ఆ షుగర్‌ డాడీ పని పడతా! | No Regrets No Apologies Assam Wife Killers Chilling Threat | Sakshi
Sakshi News home page

జైలు నుంచి వచ్చాక.. ఆ షుగర్‌ డాడీ పని పడతా!

Sep 8 2026 1:36 PM | Updated on Sep 8 2026 1:59 PM

No Regrets No Apologies Assam Wife Killers Chilling Threat

భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె తలను ఫ్రిడ్జిలో భద్రంగా దాచాడు. ఈ ఘటన దేశం మొత్తాన్ని నివ్వెర పోయేలా చేసింది. అయితే పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో మరో షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. తాజాగా మీడియా  ఎదుటే.. తన భార్యను చంపినందుకు బాధపడడం లేదని, బయటకు వచ్చాక మరో వ్యక్తిని చంపి తీరతానంటూ నిందితుడు వార్నింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అస్సాం రాజధాని గువాహటి(గౌహతి) సమీపంలో జరిగిన ఈ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య రియా తాలుక్దార్‌ (25)ను హత్య చేసి, ఆమె తలను నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు రమానుజ్‌ గోస్వామి. అయితే మంగళవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో హతిగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ షుగర్‌ డాడీని చంపుతా’’ అంటూ హెచ్చరించాడు.

అయితే ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించగా.. అతడు కోపంతో ఊగిపోయాడు.  ‘‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. క్షమాపణ కూడా చెప్పను’’ అని చెప్పాడు. 

భార్యపై అనుమానంతోనే?
రియా, రమానుజ్‌లకు సుమారు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని.. భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రమానుజ్‌ వివాదానికి దిగేవాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్‌ 3న జరిగిన గొడవలో ఆవేశానికి లోనై రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనల క్రమాన్ని దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి ఉంది.

దుర్వాసనతో వెలుగులోకి..
సెప్టెంబర్‌ 6న హటిగావ్‌-బసిస్థాపూర్‌ ప్రాంతంలోని దంపతుల నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు రెండ్రోజుల ముందు నుంచి.. కుటుంబ సభ్యులు వాళ్లకు కాంటాక్ట్‌ మిస్‌ అయ్యారు.  పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. శరీరం కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. తల కనిపించలేదు. ఇంట్లోని ఫ్రిజ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్‌ సంచిలో చుట్టి ఉంచిన రియా తలను గుర్తించారు. ఆమె వేళ్లు కూడా నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులకు లొంగిపోయిన భర్త
ఘటన అనంతరం రమానుజ్‌ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

‘షుగర్‌ డాడీ’ ఎవరు?
షుగర్‌ డాడీ అంటే Sugar Daddy సాధారణంగా తనకంటే చిన్న వయసున్న వ్యక్తికి డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశచూపి లోబర్చుకోవడం. రమానుజ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు.. ఈ కేసులో మరో కోణాన్ని తెరపైకి తెచ్చాయి. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా ‘షుగర్‌ డాడీ’ని శిక్ష పూర్తయ్యాక తిరిగొచ్చి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి ఎవరు? రియాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? నిజంగానే అలాంటి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసు కస్టడీకి అనుమతి
రమానుజ్‌ను కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటన జరిగిన సమయం, నిందితుడి కదలికలు, ఆయుధం వినియోగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం నివేదికలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement