న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)కు కొత్త అధిపతి వచ్చారు. సీబీఎస్‌ఈ చైర్ పర్సన్‌గా సీనియర్ అధికారి మన్‌దీప్ కె. భండారీ (Mandeep K. Bhandari) నియమితులయ్యారు. 2001 బ్యాచ్ ఐఏఎస్ అయిన భండారీ అరుణాచల్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్‌కు చెందిన వారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈయన నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది.
12 తరగతి మార్కుల మూల్యాంకనానికి వినియోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానంలో లోపాలతో కొద్ది నెలల క్రితం సీబీఎస్‌ఈ తీవ్ర విమర్శల పాలైంది. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్.. సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను బహిర్గతం చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జూన్ నెలలో అప్పటి సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాంశు గుప్తాను బదిలీ చేసింది. తాజాగా మన్‌దీప్ భండారీని సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌గా నియమించింది.
ఎవరీ మన్‌దీప్ భండారీ?
మెడికల్ గ్రాడ్యయేట్ అయిన మన్‌దీప్ భండారీ.. 2001లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌తో పాటు కేంద్రంలోనూ వివిధ స్థాయిల్లో పనిచేశారు. లేహ్, జమ్మూ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన తర్వాత.. జమ్మూ డివిజనల్ కమిషనర్‌గా సేవలు అందించారు. వైద్య, ఆరోగ్య విద్యా రంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. 2018లో కేంద్ర మానవనరుల మంత్రిత్వ శాఖలో కొద్దిరోజులు ప్రైవేటు సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా కొనసాగారు. శ్రీ మాతా వైష్ణోదేవి దేవాలయ బోర్డు సీఈవోగానూ సేవలు అందించారు.
ఇదీ చదవండి: చిక్కుల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కూతురు!
భండారీ ముందు సవాళ్లు
సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌గా నియమితులైన మన్‌దీప్ భండారీ ఎదుట పలు సవాళ్లు ఉన్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇప్పటికే టెన్త్, 12వ తరగతి పరీక్షల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంతకుముందు వెలుగుచూసిన పొరపాట్లు పునరావృతం కాకుండా కాచుకోవాల్సిన ప్రధాన కర్తవ్యం భండారీపై ఉంది. సీబీఎస్‌ఈ బోర్డుపై ఎటువంటి అపప్రద రాకుండా అత్యంత కీలకంగా పనిచేయాల్సిన బాధ్యత ఆయన భుజాలపై ఉంది.


