అపరాజిత | Arundhati Bhattacharya is first woman Chairperson of State Bank of India | Sakshi
Sakshi News home page

అపరాజిత

Sep 23 2026 3:56 AM | Updated on Sep 23 2026 3:56 AM

Arundhati Bhattacharya is first woman Chairperson of State Bank of India

‘కుటుంబాన్ని చూసుకోవాలా? ఉద్యోగం చేసుకోవాలా?’ అనే సంశయంలో ఉద్యోగం మానెయ్యాలనుకున్నారు అరుంధతీ భట్టాచార్య. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే, భారతీయ బ్యాకింగ్‌ రంగంలో తనకంటూ ఒక పేజీ ఉండేది కాదు. ‘కష్టంగా అనిపించినా సరే, ఉద్యోగం వదులుకోవద్దు’ అని ఆమె గట్టిగా అనుకోవడం వల్లే ఎస్‌బీఐ కి తొలి మహిళా చైర్‌ పర్సన్‌గా చరిత్ర సృష్టించారు అరుంధతీ భట్టాచార్య. తాజా విషయానికి వస్తే ఆమె ఆత్మకథలాంటి ‘ఇండామిటబుల్‌: ఏ వర్కింగ్‌ ఉమెన్స్‌ నోట్స్‌ ఆన్‌ లైఫ్‌–వర్క్‌ అండ్‌ లీడర్‌షిప్‌’ హిందీ అనువాదం ‘అపరాజిత’ విడుదలైంది...

‘ఇండామిటబుల్‌’ పుస్తకం బ్యాంకర్‌గా అరుంధతి జీవిత కథ. పురుషాధిక్య రంగంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల కథ. భిలాయ్, బొకారోలాంటి నిశ్శబ్ద పట్టణాలలో పెరిగిన అరుంధతి భట్టాచార్య తాను భారతదేశంలోని అతి పెద్ద బ్యాంకుకు చైర్‌ పర్సన్‌ అవుతానని అనుకోలేదు. బ్యాంక్‌ ప్రోబేషనరీ ఆఫీసర్‌ల ప్రవేశపరీక్ష గురించి ఒక స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న అరుంధతి దరఖాస్తు చేసుకొని, పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యారు. బ్యాంకింగ్‌ రంగంలో నాలుగు దశాబ్దాల అద్భుత ప్రయాణం చేశారు.

సానుకూల శక్తితో... 
తరచుగా బదిలీలు జరిగే ఉద్యోగంలో కుటుంబ, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత సులువేమీ కాదు. సమన్వయం చేసుకోవడం ఒకానొక కాలంలో కష్టంగా అనిపించడం తో ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నారు. అంతలోనే ఆలోచనలో పడి... 

‘ఇది సరికాదు’ అని ముందుకు కదిలారు.
వృత్తిజీవితంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. కొత్త పనిని నేర్చుకోవడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చైర్‌ పర్సన్‌గా బ్యాంకును క్లిష్టమైన దశలను దాటించారు. బ్యాంకులపై ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడినప్పుడు వాటిపై విశ్వాసాన్ని నింపారు. ఆమె నాయకత్వంలో కస్టమర్‌–సెంట్రిక్, డిజిటల్లీ అడ్వాన్స్‌డ్‌ బ్యాంక్‌గా ఎస్‌బీఐ ఎదిగింది.

ఉత్సాహంగా... 
మహిళలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి ఎందుకు ఇష్టపడడం లేదు?
ఎస్‌బీఐలో కెరీర్‌ పురోగతికి ముఖ్యమని భావించే గ్రామీణ అసైన్‌మెంట్‌లపై మహిళా అధికారులు ఆసక్తి ప్రదర్శించకపోవడంపై అరుంధతి ఆశ్చర్యపోయేవారు. ఆసక్తి లేకపోవడానికిగల కారణాలలో, గ్రామీణ ప్రాంతాలలో సరైన వసతి లేకపోవడం లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్‌బీఐ గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగికి వసతితోపాటు, మెస్‌ను కూడా ఏర్పాటు చేసింది.

దీనివల్ల మహిళ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వెనకడుగు వేయలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగం చేయడంపై ఉండే అనాసక్తిని వదులుకొని ఉత్సాహంగా, న్వతంత్రంగా పనిచేయడానికి వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘ఉద్యోగులు ఎందుకు పనిచేయడం లేదు?’ అనే సందేహం నుంచి–‘వారిని వెనక్కి లాగుతున్న కారణాలు ఏమిటి?’ అనేది విశ్లేషించడం వరకు ఎస్‌బీఐలో ప్రతి అడుగులో తనదైన పరిష్కార మార్గాన్ని చూపారు.

అదే ప్రధానం... 
‘జెన్‌ జెడ్‌ ఏదైనా సులభంగా కోరుకుంటుంది. కష్టపడడానికి ఇష్టపడరు. అసహనంగా ఉంటారు... అనే అభిప్రాయం ఒకటి ఉంది. ఇది పూర్తిగా తప్పు అని నేను నమ్ముతున్నాను. యువతరం దృఢంగా ఉంది. జీతం చెక్‌కు మించి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. యువతకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. వెనక్కి వెళ్లవద్దు. నేను చేయలేనని వెనక్కిపోవడం చాలా సులభం. అది క్షణాల్లో జరిగిపోతుంది. వెనక్కి వెళ్లను... అనుకొని ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తే మార్గాలు తెరుచుకుంటాయి. ఒకవేళ మధ్యలో ఏవైనా ఆంటకాలు ఎదురైతే అలాగే కానివ్వండి. అవి నేర్చుకోవడానికి అవకాశాలు. వాటినుంచే నేర్చుకోండి. నేర్చుకోవడమే ప్రధానం’ అంటారు అరుంధతి భట్టాచార్య.    

ఎన్నో బాధ్యతలు...ఇష్టంగా!
ఆరోజుల్లో ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అలాంటి కాలంలో బ్యాంకు ఉద్యోగంతో నా కెరీర్‌ మొదలైంది. ఉద్యోగం వచ్చిన తరువాత నేను అందులోనే కొనసాగాలనుకోవడానికి కారణం అది నాలో ఆసక్తి, ఉత్సాహాన్ని నింపడమే. నాలుగు దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానంలో వివిధ విభాగాల్లో పదహారు రకాల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవల్సి వచ్చేది. 

కార్పొరెట్‌ బ్యాంకింగ్‌ నుండి ట్రెజరీకి, ఆపై రిటైల్‌ విభాగానికి, అక్కడి నుంచి కొత్త వ్యాపారాలు  ప్రారంభించే విభాగానికి ఆ తరువాత హెచ్‌ఆర్‌కు, చివరగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు మారాను. ఇవన్నీ చాలా పెద్ద మార్పులు. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్త ఉద్యోగం చేస్తున్నట్లుగా అనిపించేది. పని చేస్తూనే నేర్చుకునే అవకాశం ఉండడం వల్ల నా ఆసక్తి అలాగే కొనసాగింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త సంస్కృతులను అర్థం చేసుకోవడం నాకు ఎప్పుడూ ఇష్టం. అందుకే ఈ ప్రయాణం నాకు ఆసక్తికరంగా అనిపించింది.
– అరుంధతి భట్టాచార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement