యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ.. ఇటీవల వార్తలు రావడంతో వినియోగదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మార్పులకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సాధారణ యూపీఐ చెల్లింపులకు వినియోగదారుల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.
అంటే ఎప్పటిమాదిరిగానే.. ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపడం ఉచితంగానే కొనసాగుతుందన్నమాట. అయితే కొన్ని పరిమితమైన వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం భవిష్యత్తులో చిన్న మొత్తంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనినే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) అంటారు.
ఉదాహరణకు.. ఒక షాప్‌లో యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు, ఆ చెల్లింపును ప్రాసెస్ చేసినందుకు వ్యాపారి చెల్లించే రుసుమే ఎండీఆర్. ప్రస్తుతం యూపీఐలో ఎండీఆర్ సున్నాగా ఉంది కాబట్టి సాధారణంగా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు తీసుకున్నందుకు ఎలాంటి ఫీజు చెల్లించడం లేదు.
ఒకవేళ భవిష్యత్తులో ఎండీఆర్‌ను ప్రవేశపెట్టినా, అది ప్రతి యూపీఐ చెల్లింపుపై ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట పరిమితి దాటిన కొన్నింటికి మాత్రమే, అదీ చాలా తక్కువ రేటుతో ఛార్జీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా.. P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) చెల్లింపులు మాత్రం ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి సాధారణంగా మనం చేసే యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు వస్తాయనే ఆందోళన ఇకపై అవసరం లేదు.
✅ No Charges for UPI Users
✅ Vast Majority of the Transactions to Remain Free of Charge for Merchants as well
✅ Amendment to the Payment and Settlement Systems Act (PSS Act) an Enabling Provision to Ensure further proliferation of Financial Inclusion, UPI’s Long-Term… pic.twitter.com/b6QYTgiw8a— Ministry of Finance (@FinMinIndia) August 8, 2026


