
జైప్రకాష్ కొనుగోలు రేసులో ముందంజ
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) కొనుగోలు రేసులో అదానీ గ్రూప్‌ను మైనింగ్ దిగ్గజం వేదాంతా వెనక్కి నెట్టింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విజయవంతం అయ్యే స్థాయిలో రూ.17,000 కోట్ల విలువైన బిడ్ దాఖలు చేసింది. దీంతో జేఏఎల్ నికర విలువ రూ.12,505 కోట్లకు చేరింది.
రియల్టీ, సిమెంట్, విద్యుత్, హోటళ్లు, రహదారులు తదితర రంగాలలో కార్యకలాపాలు కలిగిన జేఏఎల్ రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో దివాలా చట్ట(ఐబీసీ) చర్యలకు లోనైన సంగతి తెలిసిందే. మరోపక్క ఐబీసీలో భాగంగా జేఏఎల్ విక్రయంపై రుణదాతలు సమావేశమవుతున్నారు. కాగా.. జేఏఎల్ రుణ పరిష్కార చర్యలలో భాగంగా పలు దిగ్గజాలు బిడ్స్ దాఖలు చేశాయి.
అయితే అదానీ, వేదాంతా గ్రూప్‌లు మాత్రమే ఈ రేసులో ముందువరుసలో నిలిచాయి. జేఏఎల్ మొత్తం రూ.57,185 కోట్ల రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు రుణదాత సంస్థలు పేర్కొంటున్నాయి. పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ అధ్యక్షతన ఏర్పడిన రుణదాతల కన్సార్షియం నుంచి జాతీయ ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్) జేఏఎల్ రుణాలను సొంతం చేసుకున్న విషయం విదితమే. దీనిలో భాగంగా రుణదాతల జాబితాను సిద్ధం చేసింది.
ఇదీ చదవండి: మన గోప్యత బజారుపాలు!