
రిలయన్స్ రిటైల్ (Reliance Retail) దేశవ్యాప్తంగా 600కు పైగా డార్క్ స్టోర్‌లను ఇప్పటికే ప్రారంభించిందని ఇటీవల తెలిపింది. వినియోగదారులకు డెలివరీలను వేగవంతం చేయడానికి మరిన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.
డార్క్ స్టోర్‌లు అంటే ఏమిటి?
డార్క్ స్టోర్ (Dark Store) అనేది రిటైల్ వ్యాపారానికి సంబంధించిన ఒక నూతన విధానం. దీన్నే ‘డార్క్ షాప్’, ‘డార్క్ సూపర్ మార్కెట్’ అని కూడా పిలుస్తారు. ఈ స్టోర్‌లు సాధారణంగా కస్టమర్‌ల కోసం ఏర్పాటు చేసినవి కావు. అంటే కస్టమర్‌లు లోపలికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా పరిశీలించడానికి అనుమతి ఉండదు.
ఆన్‌లైన్ ఆర్డర్‌ల నిర్వహణకు..
ఇది ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఆర్డర్‌లను (Online Orders) సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఉద్దేశించిన ఒక వేర్‌హౌస్ (Warehouse) లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లాగా పనిచేస్తుంది. వేర్‌హౌస్ లోపల వస్తువులను వేగంగా ఎంచుకోవడానికి, ప్యాక్ చేయడానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణ సూపర్ మార్కెట్ లాగా అల్మారాలు ఉన్నప్పటికీ కస్టమర్‌లను ఆకర్షించే డిస్‌ప్లేలు, ప్రచార సైన్‌బోర్డ్‌లు ఇందులో ఉండవు.
ప్రధాన లక్ష్యం
డార్క్ స్టోర్‌ల ప్రధాన లక్ష్యం ఆన్‌లైన్ ఆర్డర్‌లు, నిత్యవసరాలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తక్కువ సమయంలో (క్విక్-కామర్స్), వేగంగా డెలివరీ చేయడం. రిలయన్స్ రిటైల్ కూడా 30 నిమిషాల లోపు డెలివరీలను విస్తరించడానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డార్క్‌స్టోర్లను ఉపయోగిస్తోంది.
ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే..