
ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక. అయితే మారుతున్న జీవన విలువలు కారణంగా చాలామంది కేవలం డబ్బు కోసమే తమ తల్లిదండ్రులను చూసుకుంటున్నవారు ఉన్నారు. అదే డబ్బు చేతికి రాగానే ఆ పండుటాకులను నిర్దాక్షిణ్యంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తులు పంపకాలకు ముందు వారసుల కంటే తమ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన.
జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. అయితే పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆర్థిక వనరులు/ ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకైనా ప్రాధాన్యం ఇవ్వాలి.
అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు.
కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి.
పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచ్ఛిన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు.
ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇచ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది.
ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి.
ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి.
ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం