
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న 38 ఏళ్ల ఇంజినీర్ ఆత్మహత్య కేసులో బెంగళూరు నగర పోలీసులు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తన సోదరుడు చనిపోయినట్లు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు చేశాడు. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడిని బెంగళూరులోని చిక్కలసంద్రకు చెందిన కె. అరవింద్‌గా గుర్తించారు. అతను 2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్‌లో హోమోలోగేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 28న అరవింద్ మృతి చెందగా అతని సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న కేసు నమోదైంది.
బీఎన్ఎస్ సెక్షన్ 108
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో భవీష్ అగర్వాల్‌తో పాటు వెహికల్ హోమోలోగేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ హెడ్ సుబ్రత్ కుమార్ దాష్, ఇతరులను కేసులో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్ తన 28 పేజీల సూసైడ్ నోట్‌లో దాష్, అగర్వాల్ తనను పనిలో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే జీతాలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా సక్రమంగా చెల్లించలేదని చెప్పారు. ఇది అరవింద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని మృతుడి సోదరుడు అశ్విన్ పేర్కొన్నారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మరణం తర్వాత అనుమానాస్పద లావాదేవీలు
అశ్విన్ కన్నన్ ఫిర్యాదు ప్రకారం అరవింద్ మరణించిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 30న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT) ద్వారా అతని బ్యాంకు ఖాతాలో రూ.17,46,313 జమ చేశారు. ‘అతని బ్యాంకు ఖాతాలో ఇంత భారీ డబ్బు జమ కావడంతో నాకు అనుమానం వచ్చింది. సుబ్రత్ కుమార్ దాష్‌ను విచారించిన తరువాత అతను హెచ్‌ఆర్ (HR)ను సంప్రదించాలని కోరాడు. వారిని కలిసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధులు కృతేష్ దేశాయ్, పరమేష్, రోషన్ అందరూ ఇంటికి వచ్చి డబ్బు లావాదేవీల గురించి వివరించారు. కంపెనీ ఏదో సమాచారాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని అశ్విన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ కేసును తొలుత అసహజ మరణంగా నమోదు చేసినట్లు డీసీపీ (సౌత్ వెస్ట్) అనితా బి హద్దన్నవర్ తెలిపారు. అయితే డెత్ నోట్ వెలుగులోకి వచ్చిన తరువాత మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఆమె చెప్పారు. ‘మేము ఈ కేసును పరిశీలిస్తున్నాం. దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు. ఈ విషయంలో భవీష్ అగర్వాల్, దాష్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..