నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియా వైరల్‌గా మారింది.
రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!
సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు.
మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..
వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్‌తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.
ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!


