కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని, మీ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వేసే ప్రతి అడుగును.. మీ చుట్టూ ఉండే కొంతమంది తెలియకుండానే లేదా కావాలనే వెనక్కి లాగుతుంటారు. తరచుగా మన ఆర్థిక కష్టాలకు మార్కెట్ హెచ్చుతగ్గులు, తక్కువ జీతం ఉందని నిందిస్తాం. కానీ నిజమైన శత్రువులు మన పక్కనే ఉంటారని గుర్తుంచుకోండి. వీరి ఆలోచనా విధానాలు, ఆర్థిక అలవాట్లు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపి పేదవారిగా మార్చేస్తుంటారు. మనల్ని పేదవారిగా మార్చే ఈ వ్యక్తులు ఎవరు? వారి మనస్తత్వం మన భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం.
ఖర్చులను ప్రోత్సహించడం
పేద మనస్తత్వం ఉన్నవారు సాధారణంగా తక్షణ లభించే సంతృప్తిని కోరుకుంటారు. పొదుపు చేయడాన్ని లేదా పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేస్తూ ‘రేపటి గురించి ఎవరి తెలుసు?’ అనే ధోరణితో ఉంటారు. అలాంటివారు మిమ్మల్ని తరచుగా అనవసరమైన విందులకు, పార్టీలకు లేదా ఫ్యాషన్ వస్తువులకు ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తారు. దీనివల్ల మీ బడ్జెట్‌ను దాటి ఖర్చు చేస్తారు. ‘అందరూ కొంటున్నారు, నువ్వు కొనకపోతే ఎలా?’ అనే ఒత్తిడికి లోనై అప్పులు చేయక తప్పదు.
నిరాశావాదం
కొందరు ఆర్థిక విజయానికి కృషి చేయడం కంటే తమ పేదరికానికి వ్యవస్థను, ప్రభుత్వాన్ని, లేదా ఇతరులను నిందించడానికి మొగ్గు చూపుతారు. వారి నిరాశావాదం మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఆటంకం కలిగిస్తుంది. ‘డబ్బు సంపాదించడం కేవలం అదృష్టవంతులకే సాధ్యం’, ‘ఈ వయసులో పొదుపు చేయడం ఎందుకు?’ వంటి మాటలు మీలోనూ నిరుత్సాహాన్ని పెంచి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను చంపేస్తాయి.
తప్పుడు సలహాలు
కొందరి సొంత ఆర్థిక జీవితాలు గందరగోళంగా ఉన్నప్పటికీ మీకు అనవసరమైన, అధిక రిస్క్ కూడిన పథకాల్లో డబ్బు పెట్టమని సలహా ఇవ్వవచ్చు. వారి సలహాలు విని మీరు పదేపదే తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలనే పథకాలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంపద కరిగిపోతుంది.
ఈ విషవలయం నుంచి బయటపడే మార్గం
తమ ఆర్థిక స్థితితో మీ స్థితిని పోల్చుకునే వారితో దూరం పాటించండి.
‘నో’ అనడం నేర్చుకోండి. అది మీ డబ్బుకి రక్షణ కవచం.
మీ ఆర్థిక లక్ష్యాలను ఎవరితోనూ షేర్ చేయకండి. ఎగతాళి చేసే వారు ఎక్కువ.
ఆదా, పెట్టుబడి, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడే వారితోనే స్నేహం చేయండి.
ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు


