క్రెడిట్ కార్డు స్మార్ట్‌గా వాడితే ఇబ్బందులుండవు
వడ్డీ లేని అప్పుతో పాటు రివార్డు పాయింట్లు
ఈ పాయింట్ల ద్వారా 1 శాతం వరకూ సంపాదన
చార్జీల్లేకుండా ఎయిర్‌పోర్టు లాంజ్‌లలో సదుపాయాలు
హోటల్ బుకింగ్స్ సహా ట్రావెల్ టికెట్లపై ఆఫర్లు
జీవితకాలం నిర్వహణ చార్జీల్లేకుండా ఇస్తున్న బ్యాంకులు
సకాలంలో చెల్లించకపోతే మాత్రం రుణాల ఊబిలోకి
ఒకసారి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటే బయటకు రావటం కష్టం
చాలామందికి క్రెడిట్ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి.
ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ఉచిత సదుపాయాలు... ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు నో–కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.
సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదీ.. అసలైన లాభం
ప్రతి క్రెడిట్ కార్డుకూ ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.
ఇదీ.. ప్రమాదానికి సంకేతం
మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్‌ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.
కో–బ్రాండెడ్ కార్డులు కూడా...
చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.
రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్..
→ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్: ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
→ యాక్సిస్ బ్యాంక్ ఏస్: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు.
→ హెచ్‌డీఎఫ్‌సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.
ఇలా చేయొద్దు...
→ కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం.
→ ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్ కానే కాదు.
→ వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి.
ఇదీ క్యాష్‌బ్యాక్ పవర్..
→ ఒక నెలలో కార్డుతో ఆన్‌లైన్‌లో రూ.30,000 ఖర్చు చేశారు.
→ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది.
→ ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు.
→ ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్‌లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే,
12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది.
స్మార్ట్ అంటే ఇలా..
→ క్రెడిట్‌కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి.
→ కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయనే చేయొద్దు
→ గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి.
→ లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు.
→ క్రెడిట్ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి.


