రూ.1,000 లోపు ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం | Flipkart announced zero commission policy for products priced under 1000 | Sakshi
Sakshi News home page

రూ.1,000 లోపు ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం

Nov 15 2025 7:59 PM | Updated on Nov 15 2025 8:32 PM

Flipkart announced zero commission policy for products priced under 1000

వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.1,000 లోపు ధర ఉన్న ఉత్పత్తులను విక్రయించే అమ్మకందారుల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ తమ హైపర్ వాల్యూ ప్లాట్‌ఫామ్ అయిన ‘షాప్సీ’లో విక్రయించే ఏ ఉత్పత్తికి కూడా కమీషన్ తీసుకోబోమని స్పష్టం చేసింది.

వ్యాపార వ్యయాల్లో తగ్గింపు

సాధారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో కమీషన్ రేట్లు 6-7% మధ్య ప్రారంభమై కొన్ని సందర్భాల్లో 15% వరకు ఉంటాయి. అమ్మకాల ఆధారంగా విక్రేతలు కంపెనీలకు కమీషన్‌ రూపంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమీషన్‌ను రద్దు చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ విక్రేతలకు గణనీయమైన ఊరట కల్పించింది. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ విక్రయదారు ఉత్పత్తుల రిటర్న్ ఫీజును కూడా రూ.35 వరకు తగ్గిస్తోంది. ఈ రెండు చర్యల వల్ల అమ్మకందారులకు వ్యాపార వ్యయాలు 30 శాతం వరకు తగ్గుతాయని ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్, షాప్సీ బిజినెస్ యూనిట్ హెడ్ కపిల్ తిరాణి తెలిపారు.

వినియోగదారులకు లబ్ధి

విక్రేతలు తమకు తగ్గిన వ్యయ ప్రయోజనాన్ని (జీఎస్టీ కోతలకు మించి) వినియోగదారులకు అందిస్తే అంతిమంగా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇది వింటర్‌ సీజన్‌లో పండుగలకు ముందు ఆన్‌లైన్ వినియోగాన్ని పెంచడానికి, ఎక్కువ మంది మధ్యతరగతి దుకాణదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

ఈ సందర్భంగా తిరాణి మాట్లాడుతూ..‘జీఎస్టీ తగ్గింపు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం ఇప్పటికే వినియోగానికి దోహదపడ్డాయి. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా శీతాకాల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది’ అన్నారు. గత మార్చిలో అమెజాన్ కూడా రూ.300 లోపు ధర ఉన్న ఉత్పత్తులపై కమీషన్ తగ్గించింది.

ఇదీ చదవండి: ఏడు పవర్‌ఫుల్‌ ఏఐ టూల్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement