కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్‌ తగ్గుతుందా? | Many People Worry Will CIBIL Score Go Down If Apply For New Card, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్‌ తగ్గుతుందా?

Nov 10 2025 10:05 AM | Updated on Nov 10 2025 10:56 AM

Many people worry Will CIBIL score go down if apply for new card full details

కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా మందికి సాధారణంగా ‘కొత్త కార్డు కోసం అప్లై చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందేమో?’ అనే అనుమానం ఉంటుంది. ఈ భయం సహజమే, ఎందుకంటే మంచి సిబిల్ స్కోర్ ఆర్థిక భవిష్యత్తుకు చాలా కీలకం. క్రెడిట్ కార్డు దరఖాస్తు సిబిల్ స్కోర్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వల్ల కలిగే పర్యవసానాలు, సిబిల్ స్కోర్‌ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం.

కొత్త క్రెడిట్ కార్డు

కొత్త క్రెడిట్ కార్డు (లేదా లోన్) కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ అది మీ సిబిల్ స్కోర్‌పై తాత్కాలికంగా కొద్దిపాటి ప్రభావాన్ని చూసే అవకాశం ఉంది. దీనికి కారణం ‘హార్డ్ ఎంక్వైరీ’. అంటే ఒక లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత (బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ) మీ క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి సిబిల్ (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్టును అడుగుతారు. హార్డ్ ఎంక్వైరీ మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒక నోట్‌ను ఉంచుతుంది. రుణదాతల దృష్టిలో ఇది మీరు కొత్త రుణం కోసం చేస్తున్నారని సూచిస్తుంది. ఇది సాధారణంగా స్కోర్‌ను కొద్దిగా (5 నుంచి 10 పాయింట్లు) తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించడం కొనసాగిస్తే ఈ ప్రభావం కొన్ని నెలల్లో తగ్గిపోతుంది.

  • మీ సిబిల్ స్కోర్‌ను మీరే చెక్ చేసుకుంటే అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. సాఫ్ట్ ఎంక్వైరీ మీ స్కోర్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.

తక్కువ సమయంలో ఎక్కువ కార్డుల కోసం..

కొంతమంది తక్కువ సమయంలో ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా లోన్ల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఈ అలవాటు సిబిల్ స్కోర్‌కు చాలా ప్రమాదకరం. మీరు కొద్ది కాలంలో (ఉదాహరణకు, 6 నెలల్లో) 3-4 కార్డుల కోసం దరఖాస్తు చేస్తే మీ రిపోర్ట్‌పై అదే సంఖ్యలో హార్డ్ ఎంక్వైరీలు రికార్డ్ అవుతాయి. ఎక్కువ ఎంక్వైరీలు ఉన్నప్పుడు రుణదాతలు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అత్యవసరంగా క్రెడిట్ అవసరమని భావిస్తారు. మీరు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారనుకుంటారు. రుణాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవచ్చని అంచనా వేస్తారు. ఇది మీ క్రెడిట్ రిస్క్‌ను పెంచుతుంది. తద్వారా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్తులో దరఖాస్తు చేసే లోన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.

కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నిజంగా అవసరమైన వాటికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక దరఖాస్తు రెజెక్ట్‌ అయితే వెంటనే వేరే కార్డుకు అప్లై చేయకుండా కనీసం 6 నెలలు వేచి ఉండటం ఉత్తమం.

సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి జాగ్రత్తలు

  • మంచి సిబిల్ స్కోర్ (సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ) తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన లోన్ ఆఫర్‌లు అందిస్తుంది.

  • క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలను ఎల్లప్పుడూ గడువు తేదీ కంటే ముందే చెల్లించాలి.

  • ఆలస్య చెల్లింపులు స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి.

  • క్రెడిట్ కార్డు బిల్లులను మినిమమ్ డ్యూ కాకుండా, పూర్తి మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకోవాలి.

  • మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ఎంత ఉపయోగిస్తున్నారు అనేదాన్ని క్రెడిట్ వినియోగ నిష్పత్తి(సీయూఆర్‌) అంటారు. ఉదాహరణకు మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష అయితే, మీరు రూ.30,000 కంటే ఎక్కువ ఉపయోగించకుండా చూసుకోవాలి.

  • సెక్యూర్డ్ లోన్లు (హోమ్ లోన్, కారు లోన్..), అన్‌సెక్యూర్డ్ లోన్లు (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు) మధ్య తేడా తెలుసుకోవాలి. అన్‌సెక్యూర్డ్ లోన్లపై ఆధారపడటం సిబిల్ స్కోర్‌కు మంచిది కాదు.

ఇదీ చదవండి: రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్‌ను గుర్తించిన సీబీడీటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement