ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబైలో జరుపుకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు పాల్గొన్నారు.
తొలి స్వదేశీ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంలో, సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో ఆర్‌ఏఎం (గ్రామీణ, వ్యవసాయ, చిన్న–మధ్య తరహా సంస్థలకు లోన్స్) వాటా 72 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా 4,556 శాఖలు, 21,492 టచ్ పాయింట్లతో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ కల్యాణ్ కుమార్ తెలిపారు. వ్యాపార పరిమాణం రూ. 7,37,938 కోట్లకు చేరినట్లు వివరించారు.
భారతదేశంలో తొలి స్వదేశీ బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పేరుగాంచింది. 1911లో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. సోరాబ్జీ పోచ్‌ఖానావాలా దీనిని స్థాపించారు.


