బ్యాంకింగ్ రంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘వారంలో ఐదు రోజుల పని’ డిమాండ్‌ను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)’ నేడు (జనవరి 27, మంగళవారం) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
సమ్మె అనివార్యం
జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మెకు వెళ్లక తప్పడం లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల సమాఖ్య యూఎఫ్‌బీయూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుంచి స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రతినెలా ఒకటి, మూడు, ఐదో శనివారాలు పూర్తి పని దినాలుగా ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు అధికారిక సెలవు దినాలు.
ఎవరెవరు ఏమన్నారంటే..
సీహెచ్ వెంకటాచలం (ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి: చర్చల్లో మా డిమాండ్‌పై ఎలాంటి సానుకూల హామీ రాలేదు. అందుకే సమ్మె రూపంలో నిరసనను తెలియజేస్తున్నాం.
రూపమ్ రాయ్ (ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి): 2024 వేతన సవరణ ఒప్పందంలోనే అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం కుదిరింది. కానీ అమలు కాలేదు. దీనికి బదులుగా ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు కూడా మేము సిద్ధమని తెలిపాం. పని గంటల్లో ఎలాంటి నష్టం ఉండదు.
ఎల్ చంద్రశేఖర్ (ఎన్‌సీబీఈ ప్రధాన కార్యదర్శి): ఇది విలాసం కోసం చేస్తున్న సమ్మె కాదు. మెరుగైన సేవలందించాలంటే బ్యాంకర్లకు తగిన విశ్రాంతి అవసరం.
ప్రభావితం కానున్న సేవలు
ఈ సమ్మె ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఉండనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల శాఖల్లో కింది సేవలకు ఆటంకం కలగవచ్చు.
1. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు.
2. చెక్ క్లియరెన్సులు.
3. రుణ మంజూరు ప్రక్రియలు, ఇతర అడ్మినిస్ట్రేషన్ పనులు.
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. కాబట్టి వాటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
డిజిటల్ సేవలు, ఏటీఎంలు
బ్యాంకు శాఖలు మూతపడినా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, సమ్మె కారణంగా లాజిస్టిక్స్ ఇబ్బందులు తలెత్తితే కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లభ్యతపై ప్రభావం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?


