2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్‌ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక..
వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.
ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్‌లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్‌లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్‌ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్‌లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్‌లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.
ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్‌లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.
అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్‌లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.
వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్‌తో వాణిజ్య వివాదాలు.. పాక్‌తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్‌ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్‌ను తిట్టిపోసేలా చేశాయి.


