రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్‌ను గుర్తించిన సీబీడీటీ | CBDT uncovered Rs 9169 cr bogus political donation racket shell parties | Sakshi
Sakshi News home page

రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్‌ను గుర్తించిన సీబీడీటీ

Nov 10 2025 8:33 AM | Updated on Nov 10 2025 8:33 AM

CBDT uncovered Rs 9169 cr bogus political donation racket shell parties

దేశంలో వ్యవస్థీకృత పన్ను ఎగవేత నెట్‌వర్క్‌పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సంచలన విషయాలు బయటపెట్టింది. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPP), చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), మధ్యవర్తుల సహకారంతో రూ.9,169 కోట్ల విలువైన నిధులను లాండరింగ్ చేస్తూ పన్ను ఎగవేత కోసం రాజకీయ విరాళాలుగా మళ్లిస్తున్న ఒక భారీ రాకెట్‌ను సీబీడీటీ వెలుగులోకి తీసుకొచ్చింది.

అదనపు పన్ను మినహాయింపులు

సీబీడీటీ చర్యకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2022–23, 2023–24 సంవత్సరాల్లో చట్టబద్ధంగా ప్రకటించిన రాజకీయ రసీదులతో పోలిస్తే రూ.9,169 కోట్లు అదనపు పన్ను మినహాయింపులు క్లెయిమ్ అయ్యాయి. అందులో..

  • 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.6,116 కోట్లు

  • 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.3,053 కోట్లు

భారత ఎన్నికల సంఘం ఇటీవల 800 RUPPలను రద్దు చేసిన తర్వాత రాజకీయ విరాళ చట్టాల్లోని లొసుగులను RUPPలు దుర్వినియోగం చేస్తున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీడీటీ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.

మోసపూరిత పద్ధతులు

దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సీబీడీటీ బృందాలు 420 బ్యాంక్ స్టేట్‌మెంట్లు, 200 కేసు ఫైళ్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ సందేశాలతో సహా కీలకమైన ఆధారాలను పరిశీలించాయి. ఇందులో కొందరు దాతలు మధ్యవర్తులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా RUPPలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని పన్ను రహిత రాజకీయ విరాళాలుగా క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి బదులుగా ఆయా పార్టీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న ఆదే దాతలకు నగదు ట్యాక్స్‌ లేకుండా వాపసు వెళ్తుంది. ఈ ప్రక్రియలో మధ్యవర్తులు కమీషన్లు పొందుతున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ కింద నమోదు చేసుకున్న RUPPలు జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందని రాజకీయ సంస్థలు. ఇవే ఈ అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారాయి. కేవలం 36 RUPPలు మాత్రమే రూ.5,591 కోట్లను అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. మొత్తం బోగస్ రాజకీయ నిధులలో 60 శాతం కేవలం 10 పార్టీల్లో కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.

నకిలీ పత్రాలు

సీబీడీటీ నిర్వహించిన సోదాల్లో నకిలీ విరాళాల రసీదులు, నకిలీ దాతల జాబితా, నకిలీ బ్యాంక్ రసీదు పుస్తకాలు వంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆడిట్ ట్రయల్స్‌ను చెరిపివేయడానికి, పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులను గుర్తించకుండా ఉండేందుకు ఈ దస్త్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు విధానాల్లో పారదర్శకతను మెరుగుపరచడానికి, పన్ను ఎగవేతను అరికట్టడానికి RUPPల ఆర్థిక లావాదేవీలపై కఠినమైన నిబంధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement