ఎస్‌హెచ్‌జీ, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడం ద్వారా భారీగా ఉపాధి, సంపద సృష్టి
డిసెంబర్ 8, 9 తేదీల్లో 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు
తెలంగాణ ఆర్థిక ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆధునిక, సమగ్ర, భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కీలక పాలసీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన 47వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాషిక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును బ్యాంకులు ప్రాధాన్య రంగంగా చూడాలని కోరారు. తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతోపాటు 13% జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా 2047 రోడ్‌మ్యాప్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
ఏటా 10% పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్రం పట్ల తమ కల ఏంటో, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామో వివరిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ నది పునర్జీవనం వంటి అంశాలను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు వివరిస్తామన్నారు.
ఉపాధి, సంపద సృష్టికి మద్దతు
డిప్యూటీ సీఎం బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు (MSME) బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందన్నారు. తద్వారా జీడీపీ పెరుగుతుందని తెలిపారు.
విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించి, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని చెప్పారు. బ్యాంకర్లు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను ఈ రంగాల్లో ఖర్చు చేయాలని, చీఫ్ సెక్రెటరీతో సహా ఉన్నతాధికారులను సంప్రదించి ముందుకు సాగాలని సూచించారు.
ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..


