సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే... ఊరూరా తిరుగుతున్నావ్’’ అంటూ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్, హరీష్‌రావులను ఉరితిసినా తప్పు లేదా? సమాధానం చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత విమర్శిస్తుంది. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుంది. కవిత బీఆర్ఎస్‌లో ఉన్నదా అనే అనుమానం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. సంతోషం. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
‘‘నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసా.. నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం, ఆయనను ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదు. నాకు, మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవు. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కవితకు సలహా మాత్రమే ఇచ్చా’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.


