హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ | Hyderabad CP Sajjanar Emotional Post Viral | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Jan 2 2026 12:20 PM | Updated on Jan 2 2026 12:33 PM

Hyderabad CP Sajjanar Emotional Post Viral

పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌ ఎమోషనల్‌ స్పందించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.

నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. 

చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

న్యూఇయర్‌ రెజల్యూషన్‌గా.. 
నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్‌.. ఈ ఉదయం మరో పోస్ట్‌ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. 

జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. 

ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్‌లో చేరతానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement