సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. రేపటి నుంచి శాసనసభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
ఇక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాయ్‌కాయ్ చేశారు. అనంతరం, బీఆర్‌ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద స్పీకర్ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం. అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారు. ప్రజాస్వామ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ కొనసాగించారు. బీఏఎసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు వేరు. బీఏసీ మీటింగ్ ఎజెండాను మార్చేసి, సభను తప్పుదోవ పట్టించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. అసెంబ్లీని ముఖ్యమంత్రి బూతుల మయం చేశారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శంచవద్దని ఎలా చెబుతారు?. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని విమర్శించడం లేదా?. మేము మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ. మూసీ కంటే ముందు.. ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలి. మూసీకి మేము వ్యతిరేకంగా కాదు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక స్ట్రీట్ రౌడీవా?. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
మూసీ ప్రక్షాళన మొదలు పెట్టిందే బీఆర్‌ఎస్. బాడీ షేమింగ్ సరికాదు. ముఖ్యమంత్రి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే సభను వాకౌట్ చేసాం. స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అవినీతికి రేవంత్ అడ్డాగా మారాడు. భవనానికి పర్మిషన్ కావాలంటే ఆర్‌ఆర్ టాక్స్ పెట్టాడు. రేవంత్ మాట్లాడే రైట్ లేదు.. అన్నింటికి రేవంత్ ఒక రేటు పెట్టాడు. ప్రజాస్వామ్య విలువలు సభలో లేవు అని మండిపడ్డారు.


