పరుగెడుతున్న కొనుగోళ్లు.. జాగ్రత్త! | Key Details of Social Commerce know more info user precautions | Sakshi
Sakshi News home page

పరుగెడుతున్న కొనుగోళ్లు.. జాగ్రత్త!

Nov 13 2025 1:54 PM | Updated on Nov 13 2025 2:52 PM

Key Details of Social Commerce know more info user precautions

భారతదేశంలో పండుగలు, ఆఫర్లు లేకపోయినా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా వస్తువుల కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ కొనుగోళ్ల సరళిలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ కామర్స్‌ కారణంగా ఈ-కామర్స్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. పండుగల వేళ వస్తువుల కొనుగోళ్లు పెరగడానికి సోషల్‌ కామర్స్‌ ఒక ముఖ్య కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్‌ కామర్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎలా ప్రభావం చెందుతుందో చూద్దాం.

సోషల్‌ కామర్స్‌ అంటే ఏమిటి?

సోషల్‌ కామర్స్‌ (Social Commerce) అనేది ఈ-కామర్స్‌ (E-commerce) లో ఒక భాగం. దీనిలో వస్తువుల కొనుగోలు, అమ్మకం ప్రక్రియ మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరుగుతుంది. సాధారణ ఈ-కామర్స్‌లో సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూసినా లేదా ఉత్పత్తి గురించి తెలుసుకున్నా కొనుగోలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌కి లేదా యాప్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, సోషల్‌ కామర్స్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ లేదా యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే ప్రొడక్ట్‌ను పరిశోధించవచ్చు, ఆర్డర్ చేయవచ్చు, చెల్లింపు కూడా పూర్తి చేయవచ్చు.

లక్షణాలు ఇవే..

ప్రస్తుతం యూజర్‌ వాడుతున్న యాప్‌ నుంచి బయటకు వెళ్లకుండానే కొనుగోలు(ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు) చేసే అవకాశం ఉంటుంది. పోస్ట్‌లు లేదా లైవ్ వీడియోల్లో నేరుగా ఉత్పత్తులను ట్యాగ్ చేసి దానిపై క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ద్వారా ఉత్పత్తుల ప్రచారం సాగుతుంది. వినియోగదారులు సమూహాలుగా ఏర్పడి డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. యూజర్ల ఫీడ్‌బ్యాక్, రివ్యూలు, ఫొటోల ద్వారా ఇతర వినియోగదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

పండుగల వేళ యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన ఇన్‌ఫ్లూయెన్సర్‌ల సిఫార్సులపై ఆధారపడుతున్నారు. సోషల్‌ కామర్స్‌ ఈ సిఫార్సులను, రివ్యూలను నేరుగా పర్చేజ్‌ సెంటర్లుగా మారుస్తుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నచ్చిన వస్తువును వెంటనే కొనేందుకు వీలు కల్పించడం వల్ల తక్షణ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా దీనికి తోడవుతాయి.

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • సోషల్‌ మీడియా ద్వారా కొనుగోలు చేయాలనుకునే ప్రొఫైల్‌కు బ్లూ టిక్ ఉందో లేదో చూడాలి.

  • అమ్మకందారుని రివ్యూలు, రేటింగ్‌లు, ఫాలోవర్ల సంఖ్యను పరిశీలించాలి. కొత్త లేదా తక్కువ ఫాలోవర్లు ఉన్న ప్రొఫైల్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  • చాలా మంది విక్రేతలు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఉత్పత్తులను కొనుగోలు చేసేప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా తనిఖీ చేయాలి. ధరలు, ఆఫర్లను పోల్చి చూడాలి.

  • కొనుగోలు ప్రక్రియలో సోషల్ మీడియా యాప్ నుంచి వేరే పేజీకి వెళ్లాల్సి వస్తే ఆ పేజీ సురక్షితమైనదో లేదో నిర్ధారించుకోవాలి.

  • అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసి క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు లేదా యూపీఐ పిన్‌ను నమోదు చేయకూడదు. వీలైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • 90% డిస్కౌంట్.. వంటి అతి తక్కువ ధరలకు వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ప్రకటనలు నకిలీ ఉత్పత్తులు లేదా స్కామ్‌లు అయ్యే అవకాశం ఉంది.

  • ప్రొడక్ట్‌ నచ్చకపోతే లేదా డ్యామేజ్ అయితే తిరిగి ఇచ్చే విధానం (Return Policy), రీఫండ్‌ (Refund) నిబంధనలు ఎలా ఉన్నాయో కొనుగోలుకు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.

ఇదీ చదవండి: అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement