అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది? | Right to Repair Law: Why Consumers Deserve Better After-Sales Service in India | Sakshi
Sakshi News home page

అమ్మకాలపై ఉన్న ఆసక్తి సర్వీసుపై ఏది?

Nov 13 2025 11:56 AM | Updated on Nov 13 2025 12:35 PM

why many companies are not interested providing services their products

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో వాటి సర్వీసింగ్, విడిభాగాల (స్పేర్‌ పార్ట్స్) లభ్యతపై విమర్శలు పెరుగుతున్నాయి. కొత్త ఉత్పత్తులను విక్రయించడంపై కంపెనీలు చూపే ఆసక్తి ఆ వస్తువులకు దీర్ఘకాలికంగా సేవలు అందించడంపై చూపడం లేదనేది వినియోగదారుల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఇది కేవలం వ్యాపార వ్యూహం మాత్రమే కాదు.. వినియోగదారుల హక్కులతో ముడిపడి ఉన్న నైతిక అంశం.

వినియోగదారులు ఏం చేయాలంటే..

భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 2019 యూజర్లకు అనేక హక్కులను కల్పిస్తుంది. తయారీదారులు సరైన సమయంలో నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించడంలో విఫలమైనా, వారంటీ లేదా ఏఎంసీ(Annual Maintenance Contract) కాలంలో సర్వీస్ నిరాకరించినా లేదా ఆలస్యం చేసినా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, పనితీరు గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది. దీనిలో భాగంగా కంపెనీలు తమ ఉత్పత్తులకు ఎంతకాలం వరకు విడిభాగాలు, సేవలు అందిస్తాయనే సమాచారాన్ని స్పష్టంగా అందించాలి.

లోపభూయిష్ట వస్తువు లేదా సర్వీసు లోపం కారణంగా నష్టపోయిన వినియోగదారు పరిహారం పొందేందుకు హక్కు ఉంటుంది. దీని కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వినియోగదారుల కమిషన్లు పనిచేస్తున్నాయి.
యూజరుకు నష్టం జరిగితే ఆ ఉత్పత్తిని తయారు చేసినవారు లేదా విక్రయించినవారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఉత్పత్తి సర్వీసుల విషయంలో కూడా వర్తిస్తుంది.

కఠిన నిబంధనలు కరవు

అయితే, ఎలక్ట్రానిక్ వస్తువులకు తప్పనిసరిగా ఇన్నేళ్లపాటు విడిభాగాలను ఉత్పత్తి చేయాలని లేదా సర్వీస్ సెంటర్లను నిర్వహించాలని సూచించే ప్రత్యేకమైన, కఠినమైన చట్టపరమైన నిబంధనలు (ఉదాహరణకు, Right to Repair వంటివి ఇంకా పూర్తి స్థాయిలో భారత్‌లో అమలులోకి రాలేదు) మన దేశంలో ఇంకా బలంగా లేవు. ఈ చట్టం లేకపోవడం కంపెనీలకు ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తోంది.

కంపెనీల వ్యాపార వ్యూహం

ఉత్పత్తులను విక్రయించిన తర్వాత వాటికి సర్వీసు అందించడం అనేది కంపెనీల నైతిక బాధ్యత. ఒక కంపెనీ తన ఉత్పత్తిని మార్కెట్‌లో నిలబెట్టాలన్నా, వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలన్నా అమ్మకం తర్వాతి సేవలు అందించడం తప్పనిసరి. కానీ, వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక కంపెనీలు ఈ నైతిక బాధ్యతను ఒక వ్యాపార వ్యూహంగా మార్చేశాయి.

విడిభాగాల ధరలు అధికం

కొన్ని కంపెనీలు సర్వీసులు అందిస్తున్నప్పటికీ స్పేర్ పార్ట్స్‌ ధరలు భారీగా పెంచేస్తున్నాయి. ఉదాహరణకు, ఒక పాత ల్యాప్‌టాప్ స్క్రీన్ మార్చడానికి అయ్యే ఖర్చు కొత్త ల్యాప్‌టాప్‌ ధరలో సగానికి పైగా ఉండవచ్చు. ఈ అధిక ధరల విధానం వినియోగదారులను సర్వీసు వైపు కాకుండా కొత్త ఉత్పత్తుల కొనుగోలు వైపు మళ్లిస్తుంది.

తరచుగా అప్‌డేట్ అయ్యే సాంకేతికత కారణంగా పాత మోడళ్లకు సర్వీసు అందించడం కంపెనీలకు వ్యయప్రయాసలతో కూడుకున్నదిగా మారుతుంది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తి జీవితకాలాన్ని తగ్గించేలా ప్రొడక్ట్‌లను రూపొందిస్తున్నారనే వాదనలున్నాయి. తద్వారా వినియోగదారులు పాత వస్తువులను పక్కనపెట్టి త్వరగా కొత్తవాటిని కొనుగోలు చేయవలసి వస్తుంది.

ప్రత్యేక చట్టం అమల్లోకి వస్తే..

భారత ప్రభుత్వం ‘రైట్ టు రిపేర్ (Right to Repair)’ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే తయారీదారులు తప్పనిసరిగా నిర్ణీత కాలం పాటు విడిభాగాలను ఉత్పత్తి చేయాలి లేదా స్వతంత్ర రిపేర్ షాపులకు సరఫరా చేయాలి. విడిభాగాల ధరలపై నియంత్రణ పెరిగి అవి సహేతుకమైన ధరల్లో లభిస్తాయి. రిపేర్ మాన్యువల్స్, టూల్స్ వివరాలను కూడా కంపెనీలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కంపెనీ కస్టమర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్‌తో డిజిటల్ భద్రత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement