ప్రపంచ ఫార్మసీగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టాలంటే వచ్చే అయిదేళ్లలో దేశీ ఫార్మా పరిశ్రమ క్రమంగా వినూత్నమైన, సంక్లిష్టమైన జనరిక్స్ తయారీ వైపు మళ్లాలని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి చెప్పారు. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, పెప్టైడ్‌లు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా పోటీ, భౌగోళిక–రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం పేటెంట్లు ముగిసిన ఉత్పత్తులనే తయారు చేయడం కాకుండా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలవైపు మళ్లాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. జనరిక్ మార్కెట్ స్థాయిని దాటి ఇతర విభాగాల్లోనూ భారత్ స్థానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సీపీహెచ్‌ఐ–పీఎంఈసీ ఇండియా 18వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.
అమెరికా టారిఫ్‌ల ముప్పుపై ఆందోళన నెలకొన్నప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు ఇప్పటివరకు వృద్ధి బాటలోనే ఉన్నాయని, 2.31 శాతం పెరిగాయని జోషి చెప్పారు. ఇక ఫార్మసీ బోధనాంశాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సిలబస్ అనేది వాస్తవ పరిస్థితులను, నేటి ఫార్మా వ్యవస్థ అవసరాలను ప్రతిబింబించేలా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ డిస్కవరీ, రీసెర్చ్ మెథడాలజీల నుంచి ముడి వస్తువుల సేకరణ, ఏఐ ఆధారిత ఫార్ములేషన్ డెవలప్‌మెంట్‌లాంటి అన్ని అంశాల
గురించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు.


