ఫార్మాకు కేంద్ర మంత్రి నడ్డా సూచన
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. వచ్చే దశాబ్దకాలంలో కీలకమైన ఏపీఐల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఫార్మా తయారీ సంస్థల సమాఖ్య ఓపీపీఐ 60వ వార్షిక సదస్సుకు ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. బయోసిమిలర్లు, వినూత్న మాలిక్యూల్స్, జీన్..సెల్ థెరపీల్లో కొత్త ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయాలని పరిశ్రమ దిగ్గజాలను ఆయన కోరారు. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ సమానంగా, అందుబాటు ధరల్లో లభ్యమయ్యే లా చూడటంపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
భారత ఫార్మా గత దశాబ్దకాలంలో గణనీయంగా పురోగమించిందని, 200 పైచిలుకు దేశాలకు ఔషధాలను సరఫరా చేస్తోందని, అమెరికా..బ్రిటన్‌లో జనరిక్ ఔషధాల మార్కెట్లో భారీ వాటాను దక్కించుకోవడంతో పాటు అంతర్జాతీయంగా 60 శాతం పైగా టీకాలను సరఫరా అందిస్తోందని మంత్రి చెప్పారు. అంతర్జాతీయంగా పరిశోధనలు, డిజిటల్ ఆవిష్కరణలకు హబ్‌గా ఎదుగుతోందని, ఫార్మా..లైఫ్‌సైన్సెస్ తదితర రంగాలకు చెందిన 1,600 పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. ఓపీపీఐతో కలిసి ఈవై పార్థినాన్ ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం నవకల్పనలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఫార్మా పరిశ్రమ 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా ఉన్న కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, తయారీ (సీఆర్‌డీఎంవో) రంగం 2028 నాటికి రెట్టింపై 14 బిలియన్ డాలర్లకు చేరనుంది.


