బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు.
శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు..
.. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు.
ఆర్జేడీది జంగిల్ రాజ్
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ..
నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు.


